ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురవుతున్నాయనే మాటలు వింటూనే ఉన్నాం. వాటిని మళ్లీ పునర్వినియోగంలోకి తీసుకురావాలంటే హ్యాకర్లు అడిగిన దానికి ఒప్పుకోవాల్సిందే. ఇలా కేవలం డబ్బుకోసం కొందరు హ్యాక్ చేస్తుంటే, ఒక దేశానికి చెందిన రహస్యాలను తెలుసుకోవడానికి మరో దేశం హ్యాక్ చేయడం తెలిసిన విషయమే. ఇటువంటి పరిస్థితుల్లో రహస్యాలను బయటకు పోనివ్వకుండా దేశాన్ని, సాంకేతికతను కాపాడుకోవడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటర్నెట్‌ను ఆపేద్దామనుకుంటున్నారు. అయితే అది తన మొబైల్‌కో, ఇంటికో, ఒక సంస్థకో కాదు. ఏకమొత్తంగా దేశానికే ఇంటర్నెట్‌ను ఆపేయగల శక్తి ఆయన సంపాదించారు. గత నెలలో ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం దేశమంతటా ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను అదుపు చేయగల అధికారం ఆ చట్టానికి కల్పించారు. దీనికి ప్రత్యామ్నాయంగా దేశంలో మరో రకమైన సాంకేతికతను రూపొందిస్తున్నారు. దాని పేరే ‘రూనెట్’ (రష్యా నెట్). ఈ వ్యవస్థ ద్వారా దేశంలోని సర్వర్లన్నింటినీ అనుసంధానిస్తారు. సైబర్ దాడుల నుంచి దేశీయ వెబ్‌సైట్లను కాపాడడానికి ప్రధానంగా రూనెట్‌ను రూపొందించినట్లు రష్యా వర్గాలు చెబుతున్నాయి. దీన్నంతటినీ రష్యాకు చెందిన ప్రభుత్వ సమాచార నిఘా సంస్థ రోస్కోమ్నేడ్జర్ పర్యవేక్షిస్తుంది. అంటే దేశంలోకి ఏ విధమైన సమాచారం రావాలన్నా, పోవాలన్నా ఈ వ్యవస్థను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు రహస్య సమాచారం దేశం దాటిపోకుండా కాపాడుకోవడానికి వీలుంటుందనేది రష్యా ఎత్తుగడ. అలాగే బయటి దేశాల నుంచి సైబర్ దాడులు చేయడానికి అవకాశాలు దాదాపు శూన్యం. అంతర్గతంగా ఎవరైనా సైబర్ దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తే నిఘా సంస్థకు ఇట్టే దొరికిపోతారు. అందుకే ఈ వ్యవస్థ పేరుతోనే పుతిన్ చట్టాన్ని చేశారు. 2021 నాటికి ఈ చట్టం పరిధిలోనే టెలికమ్యూనికేషన్ సంస్థలన్నీ సేవలందించాలని ఆయా సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు కూడా అందాయి. అంటే 2021 వచ్చే నాటికి చైనా తరహాలో రష్యాకు కూడా సొంత ఇంటర్నెట్ సాంకేతికత అమలులోకి రానుంది.
రష్యాలో ఇంటర్నెట్ కట్ చేయనున్న పుతిన్
Related tags :