ScienceAndTech

టీసీఎస్‌కు తెలంగాణా జరిమానా

telangnaa government to fine tcs for being sloppy against defending from hackers

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల వెబ్‌సైట్లను హ్యాక్‌ చేయకుండా అడ్డుకోలేకపోయినందుకు టీసీఎస్‌ కంపెనీకి జరిమానా వేయాలని తెలంగాణ డిస్కంలు యోచిస్తున్నాయి. తెలంగాణతో పాటు, ఏపీ డిస్కంల వెబ్‌సైట్లను టీసీఎస్‌ కంపెనీ నిర్వహిస్తోంది. నిర్వహణలో లోపాల వల్లనే హ్యాకర్లు చొరబడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నెట్‌ ద్వారా గుర్తు తెలియని ప్రదేశం నుంచి హ్యాకర్లు ‘రాబిన్‌సన్‌ ’అనే పేరుతో ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌ను పంపి డిస్కంల వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసి సొమ్ము డిమాండ్‌ చేశారు. హ్యాకర్లు అడిగిన డబ్బు చెల్లించకుండానే టీసీఎస్‌, డిస్కం నిపుణులు మళ్లీ వెబ్‌సైట్ల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 4 డిస్కంలకు సంబంధించిన డేటా కేంద్రం మింట్‌ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ డిస్కం(టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌) ప్రధాన కార్యాలయంలో ఉంది. ఈ డేటా కేంద్రం దెబ్బతింటే బ్యాకప్‌ డేటా కేంద్రం తిరుపతిలో ఉంది. వీటిని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయగా అలాగే కొనసాగుతున్నాయి. ఎస్పీడీసీఎల్‌లో వెబ్‌సైట్ల నిర్వహణకు ప్రత్యేకంగా నిపుణులతో డిస్కం సొంత ఐటీ విభాగం కూడా పనిచేస్తోంది. సర్వర్‌, డేటా నిర్వహణను ఈ విభాగం, టీసీఎస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంటర్నెట్‌ ద్వారా హ్యాకర్లు టీసీఎస్‌ ఏర్పాటుచేసిన ఫైర్‌వాల్‌ను ధ్వంసం చేసి డిస్కంల అప్లికేషన్‌ను హ్యాక్‌ చేశారు. అక్కడున్న సమాచారమంతా తొలగించి 50 మిలియన్‌ డాలర్లను బిట్‌కాయిన్ల రూపంలో చెల్లించాలని తాజాగా డిమాండ్‌ చేశారు. అప్లికేషన్‌లో సమాచారం అంతా పోయినా మళ్లీ డిస్కం డేటా కేంద్రంలో నుంచి తీసుకుని వెబ్‌సైట్‌ పునరుద్ధరణకు టీసీఎస్‌తో పాటు, డిస్కం ఐటీ విభాగం నిపుణులు చేస్తున్న యత్నాలు కొలిక్కి వస్తున్నాయి. శుక్రవారం సాయంత్రానికి ఎస్పీడీసీఎల్‌ వెబ్‌సైట్‌ను కొంతమేర పునరుద్ధరించారు. కానీ దానిద్వారా ఆన్‌లైన్‌లో విద్యుత్‌ బిల్లులు చెల్లించే సౌకర్యం ఇంకా వినియోగదారులకు పునరుద్ధరణ కాలేదు. ఇది జరిగితేనే పనులన్నీ పూర్తయినట్లు భావించాలి. విద్యుత్‌ బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించిన వినియోగదారుల సమాచారం అంతా భద్రంగా ఉందని ఎస్పీడీసీఎల్‌ ఐటీ విభాగం స్పష్టం చేసింది. సర్వర్‌, అప్లికేషన్‌ డేటా మొత్తం ప్రతి ఆరుగంటలకోసారి విడిగా తీసి ఎప్పటికప్పుడు భద్రపరుస్తున్నారు. దీనివల్ల హ్యాకర్లు అప్లికేషన్‌లో ఉన్న సమాచారం మొత్తం తొలగించినా మళ్లీ తాము భద్రపరిచిన దానిని తీసుకుని కొత్త అప్లికేషన్‌ రూపొందించినట్లు ఐటీ విభాగం వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపిన వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమాచారం తస్కరణ అయిందనే ప్రచారం నమ్మవద్దని డిస్కం స్పష్టం చేసింది.