Agriculture

నల్గొండ జిల్లాలో సేంద్రీయ అంజీర సాగు చేస్తున్న ఉపాధ్యాయుడు

Retired Teacher Growing Organic Figs In Nalgonda

ఆసక్తి.. ఆకాంక్ష.. ఆశయం..! మనల్ని ఎంత దూరమైనా నడిపిస్తాయి. ఏ అంశంలో అయినా సరే మనసులో ఏర్పడే ఇష్టం.. దానిని సాకారం చేసుకునే దిశగా మన అడుగులు పడేలా చేస్తుంది. కల నిజమైన నాడే కళ్లలో సంతృప్తి కనిపిస్తుంది. ఆ అంశం వ్యవసాయం.. ఆశయం.. నచ్చిన పంట సాగు చేయడం అయితే.. ఇక అందులో లభించే సంతృప్తి మాటల్లో చేప్పలేనిది. నల్గొండ పట్టణానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు పంతంగి యాదయ్యని పలకరిస్తే.. ఆయన మాటల్లో ఆ ఆనందమే వినిపిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్రాంతాల్లో విరివిగా సాగవుతున్న అంజీర పంటను యాదయ్య నల్గొండకు పరిచయం చేశారు. వ్యవసాయంపై చిన్నప్పుడే ఏర్పడిన ఇష్టాన్ని.. సేద తీరే వయసులో సాకారం చేసుకుంటు ఆయన ముందడుగు వేస్తున్నారు. వ్యవసాయం పట్ల అమితమైన మక్కువకి.. పర్యావరణం, ప్రజల ఆరోగ్యానికి మేలు చేయాలనే తపనని జోడించి.. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న యాదయ్య దంపతులు ఇతరు రైతులకి ఆదర్శం. నల్గొండ జిల్లాలో ఉద్యాన పంటలు అంటే అందరికీ ముందుగా నిమ్మ, బత్తాయి తోటలే గుర్తుకువస్తాయి. నీటి వసతి తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు ఈ పంటల వైపే ఆసక్తి చూపుతున్నారు. అయితే అందరిలా కాకుండా విభిన్నంగా ముందడుగు వేశారు విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు పంతంగి యాదయ్య. వ్యవసాయంపై మక్కువతో ఇంటర్మీడియెట్ స్థాయిలోనే వ్యవసాయ కోర్సు చదివారు యాదయ్య. 36 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి 2008లో ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతంలోనే నివాసం ఉండి వ్యవసాయం చేయాలన్న ఆలోచనతో నల్గొండ పట్టణానికి సమీపంలోని మేళ్లదుప్పలపళ్లిలో నాలుగు ఎకరాలు కొనుగోలు చేశారు. అనేక సంప్రదింపుల తర్వాత ఆ భూమిలో అంజీర పంటను వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 2017లో బళ్లారి నుంచి మొక్కలు తెచ్చి నాటారు. సాళ్ల మధ్య పది అడుగులు, మొక్కల మధ్య 8 అడుగుల దూరంతో నాటారు. ఒక్కో మొక్కకు రూ. 50, రవాణా ఖర్చులు రూ. 50, నాటేందుకు మరో రూ.150 అయ్యాయని యాదయ్య తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి దిగుబడులు పొందుతున్నారు.

సేంద్రియ పద్ధతిలో సాగు
యాదయ్య రసాయనిక వ్యవసాయానికి పూర్తిగా విరుద్ధం. రైతులు తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధించి, అభివృద్ధి సాధించాలన్నది ఆయన ఆకాంక్ష. ఇందుకు అనుగుణంగా స్వయంగా ఆయనే సేంద్రియ పద్ధతిలో అంజీర సాగు చేస్తు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మేరకు మొక్కలు నాటే సమయంలో ముందుగా వర్మీ కంపోస్ట్ వాడారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పశువుల పెంట మొక్కల పాదుల దగ్గర వేసి మట్టితో కప్పుతున్నారు. వేస్ట్ డీ కంపోజర్ ను 15 రోజులకు ఒకసారి మొక్కలకు స్ప్రే చేస్తున్నారు. నెలకు ఒకసారి వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని డ్రిప్ ద్వారా మొక్కలకు పారిస్తున్నారు. తద్వారా వానపాములు ఉత్పత్తి అయి చెట్టుకు కావాల్సిన పోషకాలు అందేలా చేస్తున్నాయని యాదయ్య చెబుతున్నారు. 200 లీటర్ల డ్రమ్ము నీటిలో 2 కిలోల బెల్లం వేసి ఒక బాటిల్ వేస్ట్ డీ కంపోజర్ ను కలుపుతున్నారు. ఆ ద్రావణాన్ని ఐదు రోజులు ఉదయం, సాయంత్రం సవ్య దిశలో కలియ తిప్పుతారు. ఆరో రోజు నుంచి ద్రావణాన్ని ఉపయోగిస్తారు. దాన్ని డ్రిప్ లేదా స్ప్రే ద్వారా మొక్కలకు అందిస్తారు.

ఎక్కువ కొమ్మలతో అధిక ఆదాయం
అంజీర తోటలను ఒక్కసారి నాటితే ఎన్నో ఏళ్లు దిగుబడులు పొందవచ్చని యాదయ్య తెలిపారు. “ఈ మొక్కలు పెరిగే సమయంలో ఎక్కువ కొమ్మలు వచ్చేలా చూసుకోవాలి. ఇందుకోసం కొమ్మల చివర్లో ఇగుళ్లు తుంచివేయాలి(పించింగ్). ఇలా చేయడం వల్ల ఎక్కువ కొమ్మలు వచ్చి కాయలు ఎక్కువ కాస్తాయి. ఒక్కో చెట్టుకి కనీసం 150 కాయలు ఉంటేనే రైతుకు మంచి ఆదాయం వస్తుంది. అంజీర చెట్టుకి పూత లేకుండానే కాయలు వస్తాయి. వేస్ట్ డీ కంపోజర్, పశువుల పెంటతో అందే పోషకాలతో కాయల పరిమాణం పెద్దగా ఉంటుంది. మా తోటలో ఒక్కో పండు కనీసం 40 గ్రాములకు పైనే ఉంటుంది. అంజీర మొక్కలు నాటిన మొదటి సంవత్సరం ఒక చెట్టు నుంచి 3 కిలోల కాయలు వస్తాయి. నాలుగో సంవత్సరం ఒక్క చెట్టు 8 కిలోల చొప్పున దిగుబడి అందిస్తుంది. ప్రస్తుతం మా తోటలో 1500 చెట్లు ఉన్నాయి. ఈ ఏడాది నాలుగు టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. వచ్చే ఏడాది 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చి నుంచి అంజీర పండ్లను తోటలోనే విక్రయిస్తున్నాం. రోజుకి పది నుంచి 15 కిలోల దిగుబడి వస్తోంది” అని యాదయ్య తెలిపారు.

అంజీర సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అంజీర సాగులో కొన్ని జాగ్రత్తలతో మంచి లాభాలు పొందవచ్చని యాదయ్య చెబుతున్నారు. “అంజీర చెట్లకు క్రమం తప్పకుండా నీరందించాలి. ఎండకాలంలో 40 డిగ్రీల వరకు పండ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎండ తీవ్రత అంతకు మించితే పండ్ల పరిమాణం తగ్గుతుంది. అందుకే చెట్లకు ఎక్కువగా ఆకులు ఉండేలా చూసుకోవాలి. అవే ఎండ తీవ్రత నుంచి పండ్లను కాపాడతాయి. దీని కోసం నేలల స్వభావం, చెట్ల అవసరాన్ని బట్టి క్రమంగా నీరు అందిస్తు ఉండాలి. మేము రోజుకి ఆరు గంటల పాటు డ్రిప్ ద్వారా నీరందిస్తున్నాం. అంజీర చెట్లను పెద్దగా చీడ పీడలు ఆశించవు. ఆకులకు రస్ట్ తెగులు మాత్రం వస్తుంది. వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని స్ప్రే చేయడం ద్వారా ఈ తెగులుని నివారిస్తున్నాం” అని యాదయ్య వివరించారు.

ఆదాయమే కాదు.. ప్రజల ఆరోగ్యము ముఖ్యమే : యాదయ్య
ప్రజలకు సేంద్రియ ఉత్పత్తులపై ఇటీవల బాగా అవగాహన పెరిగింది. ఈ పద్ధతులో పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే మేము సేంద్రియ పద్ధతుల్లో అంజీర పంటను సాగు చేయాలని నిర్ణయించుకున్నాం. ఆదాయంతో పాటు మా ఉత్పత్తులు వినియోగించిన ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మాకు సంతోషం. మా తోట రహదారి పక్కనే ఉండటంతో ఇక్కడే పండ్లు విక్రయిస్తున్నాం. రోజూ వారిగా కోసే పండ్లను ఇక్కడే అమ్ముతున్నాం. మున్ముందు దిగుబడులు పెరిగితే మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాం. ఫార్మ్ టూ హోమ్ విధానం ద్వారా వినియోగదారులకు నేరుగా పండ్లను డెలివరీచేస్తాం. ఇక కొత్తగా అంజీర తోటలు సాగు చేయాలని అని అనుకునే రైతులు ఎక్కువ మొత్తంలో కాకుండా రెండు, మూడు ఎకరాల్లో నాటుకోవాలి. అలాగే మొక్కలను నర్సరీ నుంచి కాకుండా తోటల నుంచి అంటు మొక్కలు తెచ్చుకోవాలి. ఈ పండ్ల వినియోగంపై నగరవాసలకు ఎక్కువ అవగాహన ఉన్నందున తోటలను నగరాలకు సమీపంలో సాగు చేస్తే మంచిది. ప్రస్తుతం వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగాయి. రసాయనిక ఎరువుల వినియోగమే దీనికి కారణం. వీటికి స్వస్తి పలికి ప్రతి పంటలో వేస్ట్ డీ కంపోజర్ ను వినియోగించి సాగు చేస్తే పెట్టుబడులు తగ్గుతాయి. రైతులకు ఆదాయం పెరుగుతుంది. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రజల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

అంజీర సాగుతో ఆరోగ్యం, ఆదాయం : పంతంగి రుద్రమ్మ, యాదయ్య సతీమణి
అంజీర తోటలో నీరు పెట్టడం, మొక్కల ఆరోగ్యాన్ని పరిశీలించడం వంటి పనుల్లో యాదయ్యకు ఆయన సతీమణి పంతంగి రుద్రమ్మ తోడుగా ఉంటున్నారు. తోటలో పనిచేయడం ద్వారా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలుగుతున్నామని చెబుతున్నారు. “నేను పండ్లు కోస్తాను. డ్రిప్ లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా పరిశీలిస్తా. తోటలో పనిచేయడం సంతోషంగా ఉంది. అంజీర పండు ఔషధ గుణాలు, అధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. రక్తపోటు, మధుమేహం, కాలేయ, జీర్ణాశయ సమస్యలకు అంజీర మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే ఈ పండ్లను సేంద్రియ పద్ధతిలో పండించి ప్రజలకు విక్రయిస్తున్నాం. తమ ఉత్పత్తులు తిన్న ప్రజలు సంతోషంగా ఉంటే అదే మాకు ఎంతో ఆనందం.” రైతులు కేవలం పంటలపైనే కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైనా దృష్టి సారించాలని అంటారు యాదయ్య దంపతులు. తద్వారా అన్నదాతలకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఆయన తన అంజీర తోటలో నాటు కోళ్లు, గొర్రెలను పెంచుతున్నారు. ఇక.. అరుదైన పండ్ల తోటలను సేంద్రీయ పద్ధతిలో సాగు చేసే రైతులకు మార్కెటింగ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి రైతులను ప్రోత్సహించి.. మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే.. అనేక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లే అవకాశం ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో అంజీర సాగుకి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఈ ఫోన్ నంబర్ లో సంప్రదించండి – పంతంగి యాదయ్య – 9652860030