Ø గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు 6.6 లక్షలకు పైగా తగ్గింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెరుగుతుందని భావించిన నిపుణులు.. ఈ ధోరణి చూసి ఆశ్యర్యపోతున్నారు. ఆదాయపు పన్ను విభాగం ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో ఉంచిన గణాంకాల ప్రకారం.. 2018-19లో 6.68 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2017-18)లో ఈ సంఖ్య 6.74 కోట్లు కావడం గమనార్హం. 2016-17లో ఈ సంఖ్య 5.28 కోట్లుగా ఉంది.
Ø ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,800 తాజా నియామకాలు జరుపుతామని ఎల్ అండ్ టీ సాఫ్ట్‌వేర్ విభాగమైన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఎల్‌టీఐ) ప్రకటించింది. వ్యాపారం వేగంగా వృద్ధి చెందే అవకాశాలున్నందున, తగిన నైపుణ్యాలు కలిగిన తాజా ఉద్యోగార్థులనే (ఫ్రెషర్స్) నియమిస్తామని ఎల్‌టీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ జలోనా తెలిపారు.
Ø వాహన దిగ్గజం టాటా మోటార్స్ కూడా దశలవారీగా డీజిల్ చిన్నకార్లకు స్వస్తి పలికే యోచనలో ఉంది. త్వరలో అమల్లోకి రానున్న బీఎస్-6 ఉద్గార నిబంధనల కారణంగా వీటి ధరలు పెరుగుతాయని, ఫలితంగా గిరాకీ మందగించొచ్చని, అందువల్ల ఈ కార్లను తయారీ చేయడం భారంగా మారుతుందని టాటా మోటార్స్ అధ్యక్షుడు (ప్రయాణికుల వాహన విభాగం) మయాంక్ పరీఖ్ అన్నారు.
Ø 39250- 39500 పాయింట్ల శ్రేణిలో బలమైన నిరోధం ఎదురై, గత వారం మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగిసింది. 38400- 39500 పాయింట్ల శ్రేణిలో మార్కెట్ దాదాపు 5 వారాలు స్థిరీకరించుకుంది. ఈ శ్రేణి నుంచి బయటకు వస్తేనే.. స్వల్పకాలంలో దిశానిర్దేశం కలుగుతుంది. 38780 దిగువకు చేరితే.. సమీపకాలంలో మరింత బలహీనతకు ఆస్కారం ఉంటుంది.
Ø రూ.25,000 కోట్ల రైట్స్ ఇష్యూలో భాగంగా వొడాఫోన్ ఐడియా ప్రమోటర్లు రూ.17,920 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సంస్థ వెల్లడించింది. వాస్తవానికి రూ.18250 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినా, ఇష్యూకు లభించిన ఓవర్ సబ్‌స్క్రిప్షన్ వల్ల ఇంతకు పరిమితమైనట్లు తెలిపింది. ఈ పెట్టుబడి వల్ల కంపెనీలో ప్రమోటర్ల వాటా 71.33% నుంచి 71.57 శాతానికి చేరింది.
Ø చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షామీ భారత స్మార్ట్‌ఫోన్ విపణిలో దూసుకుపోతోంది. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్‌కు దీటుగా విక్రయాలను జరుపుకొంటున్న షామీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2.75కోట్ల స్మార్ట్‌ఫోన్లను విపణిలోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.
Ø సుంకాలపై అమెరికాతో చైనా జరుపుతున్న చర్చలు మందగించిన వేళ అగ్రరాజ్యం మళ్లీ వాణిజ్య యుద్ధానికి తెర తీసింది. దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై 25 శాతం పన్ను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త సుంకాలు మే 10 నుంచి అమల్లోకి రానున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
Ø జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్‌వేగన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గతంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ విధించిన రూ.500 కోట్ల జరిమానాపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. నేడు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని బెంచ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
మార్చి 7వ తేదీన జాతీయ హరిత ట్రైబ్యూనల్ ఫోక్స్ వేగన్‌కు రూ.500 కోట్లు జరిమానా విధించింది.
Ø నేటి డాలరు మారకపు విలువ రూ.69.32