అనుష్క కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం ‘అరుంధతి’. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అరుంధతిగా, జేజమ్మగా రెండు పాత్రల్లో అనుష్క కనబరిచిన వైవిధ్యమైన నటన అందరినీ అలరించింది. క్షుద్ర శక్తులను వశం చేసుకున్న అఘోర పశుపతిగా సోనూ సూద్ కూడా అదరగొట్టేశారు. అయితే, ఈ సినిమాలో అరుంధతి పాత్ర కోసం తొలి ఛాయిస్ అనుష్క కాదట. దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డిలు అరుంధతి పాత్ర కోసం తొలుత మంచు లక్ష్మిని అనుకొన్నారట. ఆమె అమెరికాలో ఉండటంతో డేట్స్ కుదరక ఈ పాత్ర చేయలేకపోయారు. ఒకనొక దశలో మమతా మోహన్‌దాస్‌ను కూడా చిత్ర బృందం సంప్రదించింది. క్యాన్సర్ కారణంగా ఆమె సినిమా చేయలేనని చెప్పడంతో అనుష్కను తీసుకున్నారు. అయితే, అనుష్కను కూడా ఆ పాత్ర కోసం సులభంగా ఒకే చేయలేదు. ఆమెపై డమ్మీ షూట్ చేశారు. జేజెమ్మ పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్‌ను ప్రత్యేకంగా తయారు చేయడానికి కేరళ నుంచి డిజైనర్లను రప్పించారు నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి. నాలుగు లక్షలు ఖర్చు పెట్టి రెండు రకాల కాస్ట్యూమ్స్ తయారు చేయించారు. వాటిని అనుష్క ధరించిన తర్వాత అందరూ బాగుందని మెచ్చుకుంటే, శ్యాంప్రసాద్‌రెడ్డి మాత్రం ‘ఇక్కడ బాగానే ఉంటుంది. సెట్‌లోకి వెళ్లిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి’ అని సెట్‌కు తీసుకెళ్లారట. తీరా, అక్కడకు వెళ్లిన తర్వాత కథ ప్రకారం అనుకున్న సెట్‌కు, డిజైన్ చేయించిన దుస్తులకు సరిపోకపోవడంతో వాటిని పక్కన పెట్టేసి, కొత్త కాస్ట్యూమ్స్‌ను తయారు చేయించారు. ఇందు కోసం మూడు, నాలుగు నెలలు సమయం తీసుకున్నారు. ఆ తర్వాతే స్వీటిని ఓకే చేశారు. తెరపై అరుంధతిగా అనుష్క ఎలా నటించిందో అందరికీ తెలిసిందే. అయితే, ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో ఐరేంద్రిగా తన నటనతో మెప్పించిన మంచు లక్ష్మి ఉత్తమ విలన్‌గా నంది అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మంచు మమతల తర్వాత అనుష్క
Related tags :