Movies

సినిమాల్లో మార్కెట్‌ తగ్గడంతో

Kamal came to politics due to low market in movies says aiadmk

సినిమాల్లో మార్కెట్‌ తగ్గడంతో నటుడు కమల్‌హాసన్‌ రాజకీయాల్లోకి వచ్చారని మంత్రి రాజేంద్ర బాలాజీ ఆరోపించారు. ఒట్టపిడారం అన్నాడీఎంకే అభ్యర్థి మోహన్‌కు మద్దతుగా మంత్రి 10 రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పుదియంపుత్తూరు శ్రీనివాసన్‌ నగర్‌లో అన్నాడీఎంకే బూత్‌ ఏజెంట్లు, నిర్వాహకులతో సోమవారం ఆయన అలోచనలు జరిపారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ విరుదునగర్‌ అల్లంపట్టిలో కామరాజర్‌ విగ్రహం వద్ద మద్యం దుకాణం ఉందని నామ్‌తమిళర్‌ పార్టీ నాయకులు కాళియమ్మాల్‌ ఫిర్యాదు చేశారని, ఫిర్యాదు మేరకు ఆ దుకాణాన్ని వెంటనే తొలగించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేతల విగ్రహాల వద్ద మద్యం దుకాణాలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే తొలగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. తిరువైకులం గ్రామంలో ఒక పెద్దాయన కరుణానిధి మృతిపై విచారణ జరపాలని కోరాడని, ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చానన్నారు. ఒట్టపిడారం ప్రజలు ఎప్పటికీ అన్నాడీఎంకే విశ్వాసులని, ఈ ఎన్నికల్లోనూ రెండాకుల గుర్తుకు ఓటేసి పార్టీ అభ్యర్థి మోహన్‌ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కమల్‌హాసన్‌కు 65 ఏళ్ల తర్వాత రాజకీయ పరిజ్ఞానం వచ్చిందని, సినిమాల్లో బాగా జల్సాలు చేసి ప్రస్తుతం మార్కెట్‌ తగ్గడంతో ఇటువైపు వచ్చారని విమర్శించారు. ప్రచారానికి హాస్య నటుడు వడివేలు వచ్చినా కూడా చూడడానికి జనం ఎగబడతారని, అలాగే కమల్‌ను చూడడానికి వస్తున్నారన్నారు. అయితే ఆయన పార్టీకి మాత్రం ప్రజలు ఓటు వేయరన్నారు.