NRI-NRT

హెచ్1బీ అప్లికేషన్ ధరలతో జ్యూస్ పిండనున్న ట్రంప్ సర్కార్

Trump Administration To Rise Prices Of H1B Application Fees

అమెరికాకు ఉద్యోగులను పంపించే భారత ఐటీ కంపెనీలపై మరింత ఆర్థిక భారం పడనుంది. అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచేందుకు ట్రంప్‌ పాలనా యంత్రాంగం ప్రతిపాదించింది. అమెరికా యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇచ్చే అప్రెంటిస్‌ ప్రొగ్రామ్‌కు నిధులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మికశాఖ మంత్రి అలెగ్జాండర్‌ అకోస్టా తెలిపారు. 2020 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వార్షిక బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనలు చేశారు. అయితే దరఖాస్తు రుసుమును ఎంత పెంచాలనుకుంటున్నారు.. ఏయే కేటగిరిలోని దరఖాస్తుదారులకు ఈ పెంపు వర్తిస్తుంది లాంటి పూర్తి వివరాలను అకోస్టా వెల్లడించేలేదు. కాగా.. హెచ్‌-1బీ దరఖాస్తు రుసుమును పెంచితే గనుక ఆ ప్రభావం ఎక్కువగా భారతీయ ఐటీ కంపెనీలపైనే పడనుంది. హెచ్‌-1బీ వీసాపై అమెరికా వెళ్లేవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. ఇప్పుడు దరఖాస్తు ఫీజు పెంచితే.. ఐటీ కంపెనీలపై ఆర్థికంగా అదనపు భారం పడుతుంది. హెచ్‌-1బీ వీసాలపై ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం అనేక కఠిన నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ వీసాల వల్ల అమెరికాలో పనిచేసే విదేశీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని, దీనివల్ల అమెరికన్లు నష్టపోతున్నారని చెబుతూ వీసా నిబంధనలను కఠినం చేశారు. కొత్త నిబంధనల కారణంగా గతేడాది దాదాపు ప్రతి నలుగురు దరఖాస్తుదారుల్లో ఒకరి దరఖాస్తును ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తిరస్కరించారు. తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం అమెరికాలో 6.50లక్షల మంది వరకు విదేశీయులు హెచ్‌-1బీ వీసాలపై ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో అధికశాతం భారత్‌, చైనాల నుంచి వెళ్లినవారే.