Business

ముంబాయిలో స్థలాన్ని ఎంపిక చేసుకున్న యాపిల్

Apple to open store in Mumbai-picks place for store

సాంకేతిక దిగ్గజం యాపిల్‌ ఎట్టకేలకు భారత్‌లో తన విక్రయశాలలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ముంబయిలో కొన్ని ప్రదేశాల్లో స్థలాలను కూడా ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న భారత మార్కెట్లోపాగా వేసేందుకు ఐఫోన్‌ యత్నాలు మొదలుపెట్టింది. మరికొన్ని వారాల్లో తన తొలి స్టోర్‌ ఎక్కడ పెట్టాలనేది తేల్చుకుంటుంది. ఇప్పటికే ఐఫోన్‌ ప్రపంచంలోని ప్రఖ్యాత ప్రదేశాల్లో తన స్టోర్లను ఏర్పాటు చేసింది. వీటిల్లో న్యూయార్క్‌లోని ఫిఫ్త్‌ అవెన్యూ, లండన్‌ రెజెంట్‌ స్ట్రీట్‌ వంటివి ఉన్నాయి. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం యాపిల్‌ ఇక్కడ స్టోర్లను తెరిచే అవకాశం లేదు. కానీ ఇటీవల నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. దీంతో ఉత్పత్తి కేంద్రాన్ని భారత్‌కు తరలించడంతో పాటు రిటైల్‌చైన్‌లను కూడా విస్తరించాలని భావిస్తోంది. గత వారం జరిగిన మీటింగ్‌లో టిమ్‌ కుక్‌ మాట్లాడుతూ భారత్‌ చాలా కీలకమైన మార్కెట్‌ అని అన్నారు. భారత్‌లో సవాళ్లు ఉన్నా…..నేర్చుకోవడానికి చాలా ఉందని కుక్‌ అభిప్రాయపడ్డారు. యాపిల్‌ ఆదాయంలో భారత్‌ వాటా ప్రస్తుతానికి చాలా స్వల్పంగా ఉంది. అమెరికా నుంచి 44శాతం, చైనా నుంచి 18శాతం వస్తున్నాయి.