Sports

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన సన్‌రైజర్స్

Sun risers hyderabad had mixed season in IPL 2019-review

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు ఈ సీజన్‌ మిశ్రమ ఫలితాలిచ్చింది. ఆఖర్లో టైటిల్‌ ఆశలు చిగురించినా ఆ జట్టు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సన్‌ రైజర్స్‌ ఈసారి బ్యాటింగ్‌లో పరుగుల వరద పారించింది. ఈసారి సన్‌ రైజర్స్‌ అనగానే ముందుగా గుర్తొచ్చింది.. డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో ఓపెనింగ్‌ జోడీ. సీజన్‌లో వాళ్ల బ్యాటింగ్‌ ఊచకోతను తలపించింది. మిడిల్‌ ఆర్డర్‌లో ఎవరూ పెద్దగా రాణించకున్నా.. సీజన్‌ ఆఖర్లో మనీశ్‌ పాండే.. బ్యాటింగ్‌ బాధ్యతలు తీసుకొని ఫరవాలేదనిపించాడు. భువనేశ్వర్‌కుమార్‌ అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఇలా ఐపీఎల్‌ 12వ సీజను సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కొంచెం తీపి, కొంచెం చేదు జ్ఞాపకాలతో ముగించింది. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడాల్సి వచ్చిన ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి జట్టు ఓపెనింగ్‌ జోడిపైనే దృష్టి పెట్టింది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.. వార్నర్‌, బెయిర్‌ స్టో విజృంభణ ఎంతలా సాగిందో. వార్నర్‌ ఆడిన 12 మ్యాచుల్లో 69.20 సగటుతో 692 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. వార్నర్‌ మధ్యలోనే జట్టుకు దూరమైనా ఇంతవరకూ మరే బ్యాట్స్‌మెన్‌ వార్నర్‌ రికార్డును తాకలేదు. ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే ఆరెంజ్‌ క్యాప్‌ వార్నర్‌ పేరిటే ఉంది. స్ట్రైక్‌ రేట్‌ కూడా 143.86 అందులో ఎనిమిది అర్ధశతకాలు, ఒక శతకం ఉన్నాయి. మరోవైపు తొలిసారిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో కూడా 10 మ్యాచుల్లో 55.62సగటుతో 445 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు ఒక శతకం ఉన్నాయి. ఈ ఇద్దరినీ ఔట్‌ చేస్తే చాలు సన్‌ రైజర్స్‌ను గెలవొచ్చన్న స్థాయిలో ప్రత్యర్థిజట్లు యత్నించాయి. మొదటి నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో సన్‌ రైజర్స్‌ ఈసారి కూడా టైటిల్‌ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని హెచ్చరికలు చేసింది. వార్నర్‌, బెయిర్‌ జోరు చూస్తే అందరికీ అదే నిజమనిపించింది. అయితే, వార్నర్‌, బెయిర్‌ స్టో జట్టుకు స్వదేశానికి వెళ్లడంతో సన్‌ రైజర్స్‌ కథ అడ్డం తిరిగింది. ఉన్నట్టుండి సన్‌ రైజర్స్‌ ఒక్కసారిగా చతికిలపడింది. వాళ్లిద్దరి గైర్హాజరీలో ఆఖరి ఐదు మ్యాచుల్లో సన్‌ రైజర్స్‌ నాలుగు పరాజయాలు చవి చూసింది. 12 పాయింట్లు మాత్రమే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌ సహాయంతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో పన్నెండు పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ చేరుకున్న జట్టుగా సన్‌ రైజర్స్‌ రికార్డు సృష్టించింది. కీలకమైన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడి ఇంటి దారి పట్టింది.