Business

ఫోర్జరీ దొంగలు

TV9 Raviprakash and actor Sivaji Summoned by Police For Fraud

టివి9 మాజీ సీఈవో రవిప్రకాష్‌, హీరో శివాజీకి నోటీసులు ఇచ్చారు పోలీసులు. రవిప్రకాష్‌ ఇంటికి వెళ్లిన పోలీసుల బృందం. ఆయన అందుబాటులో లేకపోవడంతో రవి ప్రకాష్ భార్యకు 160 సీఆర్‌పీసీ నోటీసులు అందజేశారు. రేపు తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. రవి ప్రకాష్‌తో పాటు హీరో శివాజీ కూడా నోటీసులు ఇచ్చారు. కాగా, రవి ప్రకాష్‌తో పాటు హీరో శివాజీపై అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, ఐటీ యాక్ట్ 66, 72  కింద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీ9ను కొనుగోలు చేసిన అలంద మీడియాకు అప్పగించినట్లు ఒప్పందం జరిగినా డైరెక్టర్ల నియామకానికి అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు.

నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్‌కు టీవీ9 ఉద్వాసన పలికింది. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, సంస్థలో కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో యాజమాన్యం గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎబీసీఎల్) వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం ఎనిమిది శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తన నిర్ణయాలే చెల్లుబాటు అయ్యేలా ఒత్తిడి తేవడంతో పాటు, టీవీ9 తన ఆధ్వర్యంలోనే నడవాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా టీవీ9లో మెజారిటీ వాటా కలిగిన శ్రీనిరాజు తన వాటాలను అలంద మీడియాకు విక్రయించిన విషయం విదితమే. మరోవైపు టీవీ9 వ్యవహారంలో నటుడు శివాజీ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. టీవీ9లో నటుడు శివాజీకి కూడా వాటా ఉన్నట్లు … రవిప్రకాశ్‌ నుంచి ఆయన ఈ షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. టీవీ9ను అలంద మీడియా టేకోవర్‌ చేసుకున్న అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియను సవాల్‌ చేస్తూ శివాజీ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సవాల్‌ కూడా చేశాడు. అయితే రవిప్రకాశ్‌ ప్రోద్బలంతోనే శివాజీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలకు ఊతమిస్తూ రవిప్రకాశ్‌, శివాజీ కలిసి ఉన్న ఓ ఫోటో గత ఏడాది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అందుకే ఆరునెలలకు ఓసారి ఆపరేషన్‌ ’గరుడ’ అంటూ హడావుడి చేసే శివాజీకి టీవీ9 ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ చేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివాజీని కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.