Devotional

సత్యనారాయణుడి పెళ్లికి శ్రీరాముడే పెద్ద

సత్యనారాయణుడి పెళ్లికి శ్రీరాముడే పెద్ద

అనేకంలో ఉన్న ఏకమే సత్యం… దాన్ని తెలుసుకోవడం కోసమే మనిషి నిరంతర అన్వేషణ… అయితే సత్యమే ఓ దైవ స్వరూపంగా పూజలందుకుంటోంది అన్నవరంలో… సత్యనారాయణస్వామి రూపంలో…తూర్పు గోదావరి జిల్లాలో సుప్రసిద్ధ క్షేత్రం అన్నవరం ఉంది. ఇక్కడ రత్నగిరి అనే కొండపై శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి పేరుతో కొలువైన అంతర్యామి రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లోని లక్షలాది మంది భక్తులకు సుపరిచితుడే. త్రిపాద్విభూతి మహా వైకుంఠ నారాయణ యంత్రంపై ప్రతిష్ఠితుడైన సత్యదేవుడు శతాబ్దాలుగా భక్తుల కొంగుబంగారమై భాసిల్లుతున్నాడు. ఆయన నామరూప విశేషాలు భక్తులకు ఏం బోధిస్తున్నాయి?
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతశ్శివరూపిణే
అగ్రతో విష్ణురూపాయ సత్యదేవాయతే నమః
దేశంలోని ఇతర ప్రాంతాల్లో సత్యనారాయణుడిని విష్ణుస్వరూపంగా భావించి ఆరాధిస్తారు. అన్నవరంలో మాత్రం ఆయన త్రిమూర్త్యాత్మకుడు. బ్రహ్మవిష్ణు మహేశ్వరుల సంయుక్తావతారంగా… త్రిగుణాత్ముడిగా భాసిల్లుతున్నాడు. స్వామి నామధేయంలోని వీర శబ్దానికి ఉత్సాహం, పరాక్రమమనే అర్థాలున్నాయి. ఆయనను దర్శించినంతనే మనోత్సాహాన్ని… తద్వారా లౌకిక జీవనంలోని క్లేశాలను ఎదుర్కొనే స్థయిర్యాన్ని ప్రసాదిస్తాడని చెబుతారు. నారాయణుడే సత్యం… సత్యమే నారాయణతత్త్వం. ఇదీ స్థూలంగా ఈ నామ వైశిష్ట్యం.
**వ్రతం.. వరం…
సత్యనారాయణస్వామి ఆరాధనలో ప్రధానమైనది వ్రతం. తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, గుజరాత్‌, బిహార్‌, బెంగాల్‌, ఒడిశా, మహారాష్ట్ర, అసోం, గోవా తదితర ప్రాంతాల్లో ఇది జనబాహుళ్యంలో ఆచారంగా వస్తోంది. గృహస్తులు కూడా తమ ఇళ్లల్లో శుభకార్యాల సందర్భంగా ఈ వ్రతం చేసుకోవడం పరిపాటి. పక్ష, మాస, సంవత్సర విరామాల్లో క్రమం తప్పకుండా వ్రతం చేసుకునే వారూ లేకపోలేదు. కొందరు ఉదయం వేళల్లోనే దీన్ని ఆచరిస్తే… కొన్ని ప్రాంతాల్లో పగలంతా ఉపవాసం ఉండి… ప్రదోష వేళ వ్రతాన్ని ప్రారంభిస్తుంటారు. అన్నవరం దేవాలయంలోనూ వ్రతాలకు ప్రాధాన్యముంది. కష్టాలు తొలగిపోయి… సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని భక్తులు కోరుకోవడం వ్రత ఉద్దేశం. తాత్త్విక లక్ష్యంతో చూస్తే ఇందులోని పరమార్థం బోధపడుతుంది. సత్యాన్నే నిత్యవ్రతంగా స్వీకరించాలన్న సందేశం కనిపిస్తుంది. ఏ పనినైనా ధర్మబద్ధంగా చేయడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయన్న సూచన గోచరిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః – ధర్మానికి లోబడి జీవిస్తుంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందన్నమాట. సత్య, ధర్మాల మధ్య స్థూల స్థాయిలో పెద్దగా భేదం లేదు. సత్యవంతులై ప్రవర్తించడం, ధర్మబద్ధంగా జీవించడం రెండూ ఇంచుమించు సమాన భావాలుగానే కనిపిస్తాయి.
**విష్ణుప్రసాదమే…
సత్యనారాయణ స్వామి వ్రతం సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు ప్రోక్తమని స్కాంద పురాణం చెబుతోంది. నారద మునికి చెప్పడం ద్వారా నారాయణుడే ఈ వ్రత విశేషాన్ని లోకానికి అందించినట్లు ప్రతీతి. ‘భగవన్దేవ దేవేశః సత్యనారాయణ వ్రతం తత్ప్రియార్థం కరిష్యామి ప్రసీద కమలాపతే’ అంటూ వ్రతం ప్రారంభిస్తాం. స్వామీ నీ ప్రీత్యర్థం ఈ వ్రతమాచరిస్తున్నామని విన్నవిస్తాం. నిజంగా ఆయన ప్రీతి చెందేది కేవలం పూజాదికాలకు కాదు. సంపూర్ణమైన సద్వర్తనతో కూడిన భక్తికి మాత్రమే. అందువల్ల ఈ వ్రతం ద్వారా సత్యాన్ని అనుసరించడం జీవన గమనంగా మార్చుకుంటే… పరమాత్మ ‘అచ్యుతుడు’గా మనతోనే ఉంటాడనడంతో సందేహమేముంది?
**ఆ పెళ్లికి శ్రీరాముడే పెద్ద…
అన్నవరంలో సత్యనారాయణస్వామి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ఏటా వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంటారు. కల్యాణం సహా ఇక్కడ స్వామికి జరిగే సమస్త ఉత్సవాలకూ ఆలయ క్షేత్రపాలకుడైన సీతారామచంద్రమూర్తే పెద్దరికం వహిస్తాడు. సత్యనారాయణస్వామి మూలవిరాట్టు కూడా శ్రీరాముడిని పోలి ఉండడం మరో ప్రత్యేకత. ఎడమ చేతిలో ధనుస్సు, కుడిచేతిని కొంచెం మడిచి బాణం పట్టుకుని… అదే చేతితో అభయమిస్తున్నట్లుగా స్వామి దర్శనమిస్తాడు. రాముడిలాగే సత్యనారాయణుడు కూడా సత్యవాక్య పరిపాలకుడు. సత్యవ్రతధారుల రక్షకుడు.

1. బెల్లం లడ్డూ -యాదాద్రిలో ప్రయోగాత్మకంగా తయారీ
భక్తులకు విక్రయించే ప్రసాదాల్లో బెల్లం లడ్డూ తయారీ ప్రక్రియకు యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి దేవస్థానం గురువారం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆలయ నిర్వాహకులు ఐదు రోజులుగా బెల్లం లడ్డూల తయారీపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆలయ ఈవో 11 మంది ఉద్యోగులతో ప్రత్యేక కమిటీని నియమించారు. ఐదుగురు ఏఈవోలు, ఇద్దరు ప్రధాన పూజారులు, మరో ఇద్దరు వంట స్వాములు, ఇద్దరు పర్యవేక్షకులతో ఏర్పాటైన కమిటీ గురువారం వాటి తయారీ చేపట్టింది. తెల్ల బెల్లం(చెరుకు బెల్లం)తో 80, వంద గ్రాముల బరువు కలిగిన లడ్డూలను తయారు చేశారు. అందులో వాడిన దినుసులు, పాకం తయారీ తీరు, సమయం వివరాలన్నింటితో కమిటీ నివేదిక రూపొందించి శుక్రవారం ఆలయ ఈవోకు అందజేయనుంది. ఆ నివేదికను దేవాదాయశాఖ కమిషనర్‌కు అందజేస్తామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
2. శ్రీవారికి రూ.కోటి విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి దిల్లీకి చెందిన సి.టెల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వ్యవస్థాపకులు, సీఈవో కె.శ్రీనివాస కృష్ణ దంపతులు గురువారం రూ.కోటి విరాళాన్ని సమర్పించారు. తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను దాత అందజేశారు. విరాళం మొత్తాన్ని శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు కింద డిపాజిట్‌ చేయాలని ఈవోకు సూచించారు. శ్రీనివాస కృష్ణ గతంలోనూ పలుమార్లు తితిదేకు విరాళాలు సమర్పించి.. స్వామివారి పట్ల భక్తిని చాటుకున్నారు.
3. అట్టహాసంగా శ్రీరామ జయం శోభాయాత్ర
శ్రీరామ జయం పేరిట గురువారం భద్రాచలంలో నిర్వహించిన శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. స్థానిక జీయర్‌ మఠంలో అహోబిల రామానుజ జీయర్‌ స్వామి గత నెల 13 నుంచి శ్రీరామ క్రతువు నిర్వహిస్తున్నారు. క్రతువు ముగింపు సందర్భంగా ఉత్తర ద్వారం వద్ద నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ, కోలాటాలు, భజనలు, కొమ్ము నృత్యాలతో ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. శ్రీరామ జయ రామ అంటూ నీరాజనాలు పలుకుతూ దాశరథి కీర్తనలను ఆలపిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగాల మధ్య నిర్వహించిన శోభాయాత్ర మంత్రముగ్ధులను చేసింది. చిన జీయర్‌ స్వామికి గురువైన పెద జీయర్‌ స్వామి 55 సంవత్సరాల కిందట భద్రాచలంలో శ్రీరామ క్రతువును నిర్వహించారు. అయిదున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ వేడుక చేపట్టడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రామాలయం ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు, స్థానాచార్యుడు స్థలసాయి, ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులు, వెంకటాచార్య తదితరులు పాల్గొన్నారు.
4. శ్రీవారి దర్శనానికి దాతలకు ఆంక్షలు
దాతల పట్ల తితిదే అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు తావిస్తోంది. వారికి కల్పించే సౌకర్యాలు, దర్శనాలపై నియంత్రణ విధించడంపై ఆక్షేపణలు వస్తున్నాయి. శ్రీవేంకటేశ్వర స్వామికి విరాళాలు ఇచ్చే వారికి దేవస్థానం పలు సౌకర్యాలు వర్తింపజేస్తోంది. రూ.10 లక్షలకు పైగా విరాళాలు ఇచ్చే దాతలకు ఎల్‌-2 కేటగిరిలో, రూ.కోటి ఇచ్చే పక్షంలో ఎల్‌-1 కేటగిరి కింద సంవత్సరానికి మూడుసార్లు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తోంది. రూ.10 లక్షల కంటే ఎక్కువగా విరాళాలు ఇచ్చిన వారు 30వేల మంది వరకు ఉన్నారు. వేసవి సెలవుల రద్దీ కారణమంటూ వీరికి తితిదే కొన్ని షరతులు విధించింది. రోజుకు 30 మంది దాతలకు, వారితో పాటు మరో నలుగురు చొప్పున మొత్తం 150 మందికే అవకాశం కల్పిస్తామంటూ ఇటీవల కొత్త నిబంధన అమలులోకి తెచ్చింది. అందులోనూ శుక్ర, శని, ఆదివారాల్లో ఈ అవకాశాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఆన్‌లైన్‌లో ముందుగానే టిక్కెట్లు నమోదు చేసుకుని తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ విధానంపై అవగాహన లేనివారు నేరుగా తిరుమలకు వచ్చి ఇక్కడి దాతల విభాగంలో బ్రేక్‌ దర్శనానికి దరఖాస్తు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో రోజువారీ కోటా 150 టిక్కెట్లు అయిపోయాక.. దాతల విభాగాన్ని ఆశ్రయించిన వారికి అవకాశం లభించడం లేదు. దీంతో చేసేది లేక మరోరోజు వరకు నిరీక్షించి దర్శించుకొంటున్నారు. గతంలో లేనివిధంగా ఈసారి కొత్తగా నియంత్రణ విధిస్తున్నారంటూ పలువురు దాతలు తిరుమలకు వచ్చాక వాపోతున్నారు. ప్రొటోకాల్‌ ప్రముఖుల కోటా కింద ఇతరులు ఎందరో బ్రేక్‌ దర్శనం చేసుకుంటున్న తరుణంలో దాతల పట్ల షరతులు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
5. యాదాద్రీశుడి జయంత్యుత్సవాలు
శ్రీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలకు తెలంగాణలోని యాదాద్రిభువనగిరి జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ నృసింహ క్షేత్రం యాదాద్రి (యాదగిరి గుట్ట) సిద్ధమవుతోంది. స్వయంభువుగా వెలసిన ఈ స్వామిని దర్శించుకుంటే అభీష్ట సిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రస్తుతం ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి క్షేత్రంగా పునర్నిర్మాణాన్ని జరుపుకొంటోంది. యాదాద్రిలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో నిర్వహించే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలతో పాటు వైశాఖ శుద్ధ ద్వాదశి నుంచి చతుర్దశి వరకూ… మూడు రోజుల పాటు జరిగే స్వామివారి జయంతి ఉత్సవాలు కూడా సుప్రసిద్ధమైనవి. ఈ ఏడాది ఈ ఉత్సవాలను మే 15 నుంచి 17వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. వీటిలో భాగంగా 15న లక్ష పుష్పార్చన, 16న లక్ష కుంకుమార్చన, 17న సహస్ర కలశాభిషేకం జరుగుతాయి. అదే రోజున, స్వామి వారి జయంతిని పురస్కరించుకొని, శ్రీ నారసింహావతార ఆవిర్భావ ఘట్టాల ప్రదర్శన ఉంటుంది. వీటితో పాటు ఈ మూడు రోజులూ పురాణ ప్రవచనాలు కూడా ఉంటాయి.
6. రేపటి నుంచి శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తియ్యాయి. మే 11వ తేదీ నుంచి తొమ్మిదిరోజుల పాటు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా శుక్రవారం సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు సర్వదర్శనం అనంతరం వివిధ సేవలు చేపట్టనున్నారు. సాయంత్రం సుమారు 6గంటల సమయంలో అంకురార్పణ ఘట్టం ప్రారంభం కానుంది.11న ధ్వజారోహణంతో ప్రారంభం: ఈ నెల 11వ తేదీన ధ్వజారోహణంతో వైభవంగా బ్రహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి తితిదే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్రహ్మోత్సవాల వైభవాన్ని చాటేందుకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రచార రథాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అంతేకాకుండా శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ పరిసరాలలో స్వామివారి కీర్తనలు భక్తులకు వినిపించేలా అవసరమైన లౌడ్‌ స్పీకర్లను సైతం ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం నుంచే ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్తు దీపాలంకరణలతో పండగ వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఈ ఏడాది భక్తులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ పలు ఏర్పాట్లను చేపట్టింది. బ్రహ్మోత్సవాల రద్దీ దృష్ట్యా అదనంగా క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. పరిశుభ్రత విషయంలో భద్రతాపరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన బందోబస్తుకు తితిదే విజిలెన్స్‌, ప్రభుత్వ పోలీసులను నియమించి నిరంతరం పర్యవేక్షించనున్నారు. అలాగే స్వామివారి వైభవాన్ని తితిదే శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. నగరంలో ఆధ్యాత్మిక శోభా ఉట్టిపడేలా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్మాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
7. కన్నుల పండువగా భద్రకాళి బ్రహ్మోత్సవాలు
తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన వరంగల్ శ్రీభద్రకాళీ ఆలయంలో అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారిని ఇవాళ ఉదయం సూర్యప్రభవాహనంపైసాయంత్రం హంసవాహనంపై ఊరేగించారు. ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకమ్మసేవా సంఘం ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో ఆర్ సునీతసిబ్బంది సౌకర్యాలు కల్పించారు.