Editorials

ఇది టీవీ9లో రవిప్రకాష్ రేపిన రచ్చ వెనుక అసలు కథ

The real story behind TV9 vs Raviprakash

తెలుగు శాటిలైట్‌ చానళ్లలో కొత్త ఒరవడి తెచ్చిన టీవీ9 నుంచి ఆ చానల్‌ సీఈఓ వెలిచేటి రవిప్రకాశ్‌ను తొలగించారు. చానల్లో 90% వాటాను మైహోమ్‌ గ్రూప్, మేఘ ఇంజనీరింగ్‌ సంస్థలకు చెందిన అలందా గ్రూపు ఇటీవలే కొనుగోలు చేసింది. 90% వాటా కొనుగోలు చేసినప్పటికీ.. తమకు రవిప్రకాశ్‌ అడ్డంకులు సృష్టిస్తున్నారని, కంపెనీ సెక్రటరీ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని, అందుకే ఆయన్ను సీఈఓ పదవి నుంచి తొలగిస్తున్నామని అలందా మీడియా పేర్కొంది. ఫోర్జరీ విషయంలో తాము చీటింగ్‌ కేసు కూడా పెట్టినట్లు తెలిపింది. ‘రవిప్రకాశ్‌ కొందరు వ్యక్తులతో కుమ్మక్కై సంస్థకు హాని చేసేలా వ్యవహరిస్తున్నారు’అని అలందా ఆ ఫిర్యాదులో పేర్కొంది. కానీ.. గురువారం సాయం త్రం రవిప్రకాశ్‌ టీవీ9 చానల్లో కనిపించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు. అంతే తప్ప.. ఫోర్జరీ కేసు గురించిగానీ, తనపై వచ్చిన ఇతర అభియోగాల గురించి కానీ ప్రస్తావించలేదు. టీవీ9 లోగోతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లిష్, హిందీ చానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ (ఏబీసీఎల్‌)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్, ఐల్యాబ్స్‌ వెంచర్‌ కేపిటల్‌ ఫండ్‌ ప్రారంభించాయి. ఏబీసీఎల్‌లో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉంది. ఈ సంస్థలో ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా ఎదిగిన రవిప్రకాశ్, ఆయన సహచరులకు 8% వాటా ఉంది. గత ఆగస్టులో శ్రీనిరాజు తన వాటాను హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియాకు విక్రయించారు. అదే నెలలో డీల్‌ పూర్తయి ఏబీసీఎల్‌ యాజమాన్యం అలందా చేతిలోకి వచ్చింది. ఆర్‌ఓసీ (రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌)లో కూడా దీనికి సంబంధించిన పత్రాలు నమోదయ్యాయి. దీంతో నలుగురు కొత్త డైరెక్టర్లను ఏబీసీఎల్‌లో నియమించడానికి కేంద్ర సమాచార శాఖ అనుమతి కోరుతూ ఏబీసీఎల్‌ బోర్డు తీర్మానాన్ని ఆమోదించి పంపింది. ఈ తీర్మానాలపై ఒకసారి వి.రవిప్రకాశ్, మరోసారి ఎంకేవీఎన్‌ అనే మరో డైరెక్టర్‌ ఏబీసీఎల్‌ డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు. దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార శాఖ.. మొన్నటి మార్చి 29న అనుమతి కూడా మంజూరు చేసింది. అన్ని అనుమతులూ ఉన్నా.. కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్‌కు రవిప్రకాశ్‌ రకరకాలుగా అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ఆ నలుగురు డైరెక్టర్లూ ఏప్రిల్‌ 23న సమావేశమై.. తమ నియామక పత్రాలను ఆర్‌ఓసీలో దాఖలు చేయాలని కంపెనీ సెక్రటరీని కోరారు. దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో రవిప్రకాశ్, ఆయన సన్నిహితులు కొందరు ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారనేది అలందా అభియోగం. దీనిపై కంపెనీ సెక్రటరీ కూడా ఆర్‌ఓసీకి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకు న్న ఆర్‌ఓసీ అధికారులు ఏబీసీఎల్‌లో కొత్త డైరెక్టర్ల నియామక పత్రాలను ఆమోదించారు. ‘90% వాటా మా చేతిలోనే ఉంది. కనుక చట్టపరంగా పూర్తి అధికారం మాకే ఉంది. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో రవిప్రకాశ్‌ వైఖరిని సీరియస్‌గా తీసుకుని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని నిర్ణయించాం’అని అలందా మీడియా తెలియజేసింది. దురుద్దేశపూర్వకంగా సినీ నటుడు శొంఠినేని శివాజీతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించారని, సంస్థ నిర్వహణలో తమకు ఇబ్బందులు కల్పించేలా రవిప్రకాశ్‌ ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో టీవీ9 కొత్త యాజమాన్యం పేర్కొంది. కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్యమైన డేటాను తస్కరించడమే కాక, దాన్ని బయటి వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయని కూడా ఫిర్యాదులో తెలిపింది. రవిప్రకాశ్‌కు టీవీ9లో 20 లక్షల షేర్లుండగా (8%) దాన్లో 40 వేల షేర్లు తనకు విక్రయించడానికి 2018 ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకుని డబ్బులు చెల్లించానని, ఏడాదిలోగా బదిలీ చేయాల్సి ఉన్నా రకరకాల సాకులతో చేయలేదని, ఏబీసీఎల్‌ యాజమాన్య మార్పులపై తనకు నిజాలు చెప్పలేదని ఆరోపిస్తూ శివాజీ ఎన్సీఎల్టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌)కు వెళ్లటం తెలిసిందే. ఏదో ఒక వివాదాన్ని సృష్టించి.. కొత్త యాజమాన్యానికి అడ్డంకులు సృష్టించటమే శివాజీ ఉద్దేశమని అలందా పేర్కొంది. శివాజీ చెబుతున్న షేర్‌ పర్ఛేజ్‌ అగ్రిమెంట్‌ కేవలం తెల్ల కాగితాలపై ఉండడం ఇక్కడ గమనార్హం. చిత్రమేంటంటే టీవీ9లో తన వాటాను విక్రయించడానికి శ్రీనిరాజు కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చాలా డీల్స్‌ కుదిరిన తర్వాత కూడా చివర్లో బెడిసి కొట్టేవి. దీనివెనక రవిప్రకాశ్‌ ప్రమేయం ఉందనేది ఏబీసీఎల్‌ యాజమాన్య వర్గాల మాట. కొన్నేళ్లుగా టీవీ9 నిర్వహణలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న అనుమానాలున్నాయని, అవి బయటపడతాయనే భయంతోనే కొత్త యాజమాన్యాన్ని రవిప్రకాశ్‌ అడ్డుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. పైపెచ్చు డబ్బులు తీసుకుని షేర్లు ఇవ్వకపోతే రవిప్రకాశ్‌పై శివాజీ కేసు పెట్టాలి తప్ప ఏబీసీఎల్‌ను వివాదాల్లోకి లాగటం కూడా ఈ అనుమానాలకు ఊతమిచ్చేదే. సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై రవిప్రకాశ్‌ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. అంతే తప్ప.. ఫోర్జరీ వంటి ఆరోపణలపై ఎలాంటి వివరణా ఇవ్వలేదు. దీనిపై కొత్త యాజమాన్యం స్పందిస్తూ.. ‘మేం 90% వాటా కొనటం అబద్ధమా? మెజార్టీ వాటా ఉన్నా మా డైరెక్టర్లకు రవిప్రకాశ్‌ అడ్డుపడటం అబద్ధమా? తన సంతకం ఫోర్జరీ చేశారంటూ కంపెనీ సెక్రటరీ ఫిర్యాదు చేయటం నిజం కాదా? ఆ ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేయడం వాస్తవం కాదా?’అని ప్రశ్నించింది. మీపై నమ్మకముంచి చానల్‌ నిర్వహణ బాధ్యతలు అప్పగించిన కంపెనీకి మీరు చేసిందేమిటని నిలదీసింది.