*తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 13న సచివాలయంలో ఉదయం 11.30గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుధాకర్ వెల్లడించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 3వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 11,023 పాఠశాలలకు చెందిన సుమారు 5,52000 మంది విద్యార్థులు హాజరయ్యారు.
*జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల 11న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నంద్యాలలో దివంగత ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పవన్ పరామర్శించనున్నారు. అనంతరం ఆయన సమాధి వద్ద నివాళి అర్పించనున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి నంద్యాల లోక్‌సభ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన.. ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
*తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూనియర్ కళాశాలల్లో మొదటి విడత ప్రవేశాల కోసం ఈ నెల 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 1నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. రెండో విడత ప్రవేశాల తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు.
*అనర్హత వేటు పడటంతో ఖాళీ అయిన యాదవరెడ్డి, భూపతిరెడ్డిల ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. యాదవరెడ్డి స్థానానికి సంబంధించి ఈనెల 15 వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయరాదంటూ ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూపతిరెడ్డికి చెందిన ఎమ్మెల్సీ స్థానానికి 15 వరకు నోటిఫికేషన్ జారీ చేయబోమంటూ ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది.
* కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్‌పై అవగాహన లేక తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో విద్యార్థులు నష్టపోయారు. ఆ కోటా కింద నమోదు చేసుకోవాలని ఎవరూ చెప్పకపోవడం, తాము వెబ్‌సైట్‌లో ఆ అంశాన్ని పరిశీలించకపోవడంతో నష్టం జరిగిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.
*దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను విహార యాత్రల నిమిత్తం ‘వ్యక్తిగత ట్యాక్సీ’లా వాడుకున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శను కాంగ్రెస్ తిప్పికొట్టింది. నిజానికి భారత వాయుసేన జెట్ విమానాలను మోదీయే ‘సొంత ట్యాక్సీ’ల్లా వాడుకుంటున్నారని ప్రత్యారోపణ చేసింది. ఒక పర్యటనకయితే అద్దె కింద కేవలం రూ.744 చెల్లించిందని విమర్శించింది.
*గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులందరికీ తక్షణమే చెక్ పవర్ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. పల్లెల్లో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చెక్ పవర్‌ఇవ్వాలని సీఎస్‌కు లేఖ రాశారు.
*ఉపాధి కోసం యూఏఈ వెళ్లి కష్టాలను ఎదుర్కొంటున్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ముక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్యకు ఎట్టకేలకు విముక్తి లభించింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జోక్యంతో యూఏఈలోని రాయబార కార్యాలయ అధికారులు వీరయ్యను ఆదుకున్నారు.
*భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపుహౌస్ పనులను గురువారం ఉన్నతాధికారులు సందర్శించారు. వీరిలో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ప్రాజెక్టు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లుతో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
*సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయిపై నిష్పాక్షికంగా సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేసి జస్టిస్ రంజన్ గొగొయిని ఆ పదవి నుంచి తొలగించాలని పేర్కొన్నాయి.
* ప్రసిద్ధ పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం (అమెరికా)తో కలిసి హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసే ప్రణాళిక ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని వర్సిటీలతో భాగస్వామ్య అనుసంధానం, పరిశోధన కేంద్రాల స్థాపన, ఇతర అంశాలపై సహకారానికి సంబంధించి.. పిట్స్‌బర్గ్‌తో మండలి గురువారం ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
*జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2018 కోసం ఉపాధ్యాయులు ఈనెల 15వ తేదీ లోపు కేంద్ర మానవ వనరుల శాఖకు www.mhrd.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.విజయకుమార్ తెలిపారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
* హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్‌పై ఫిర్యాదు ఇచ్చినా మాదాపూర్ పోలీసులు స్పందించలేదని అర్బన్ ఏషియా రెస్టారెంట్ అండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది.
* ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నన్నయ సెట్-2019 ఫలితాలను రిజిస్ట్రార్ ఆచార్య ఎస్.టేకి గురువారం విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వర్సిటీలో పీజీ ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన ఈ పరీక్షల్లో అమ్మాయిలు అధిక సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారని ఆయన వెల్లడించారు. పరీక్ష ఫలితాలను హాల్‌టికెట్ నంబరు ఆధారంగా విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www. aknu.edu.in ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. పరీక్షలు ముగిసిన 24 గంటల్లోపే ఫలితాలను విడుదల చేయడం విశేషం.
*పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో అర్హత మార్కులు తగ్గించినందున ఆన్‌లైన్ ద్వారా విద్యార్థుల నుంచి మళ్లీ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దరఖాస్తులను కోరుతోంది. శుక్రవారం నుంచి సోమవారం వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. వీటి ద్వారా కన్వీనర్, యాజమాన్య కోటాల్లో మిగులు సీట్లను విశ్వవిద్యాలయం భర్తీ చేయనుంది.
* గ్రామపంచాయతీలవారీగా తుది ఓటర్ల జాబితాను ఈనెల 20లోగా ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 12,918 గ్రామపంచాయతీలున్నాయి. ఇక్కడ ఎన్నికల నిర్వహణలో భాగంగా తుది ఓటర్ల జాబితాను మే 10న ప్రకటించాలని ఎన్నికల సంఘం లోగడ ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించిన జాబితాలనే పంచాయతీలవారీగా విభజించి ప్రకటించాలని సూచించింది.
*ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో అమలవుతున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ పి.గురుప్రసాద్ వ్యాఖ్యానించారు. మద్యం సరఫరా, విక్రయాల్లో లోపాలకు ఆస్కారమివ్వని విధంగా పటిష్ఠ వ్యవస్థలను రూపొందించి అమలు చేస్తుండటం అభినందనీయమన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్న తీరు బాగుందన్నారు. ప్రసాదంపాడులోని ఎక్సైజ్ కమిషనరేట్‌ను గురువారం ఆయన సందర్శించారు. అనంతరం కంకిపాడులోని డిస్టలరీని, ప్రసాదంపాడులోని ఐఎంఎల్ డిపోను సందర్శించారు. ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన గురుప్రసాద్ అనంతపురం జిల్లాకు చెందిన వారు.
ఎస్పీవై రెడ్డికి నివాళులు అర్పించనున్న పవన్–తాజావార్తలు–05/10
Related tags :