Health

యోగా తర్వాత మూత్రవిసర్జన తప్పనిసరి

You must pee after doing yoga

ఆరోగ్యం అంటే మనందరం ఇదేదో శరీరానికి సంబంధించినదే అనుకుంటాం! కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయి. మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా… రెండు పార్శా్వల్లోనూ ఆరోగ్యంగా ఉంటేనే మనం ‘సంపూర్ణ ఆరోగ్యం’తో ఉన్నట్టు. మనం రకరకాల వ్యాయామాలు చెయ్యొచ్చు. పుష్టినిచ్చే ఆహారం తీసుకోవచ్చు.. మందులేసుకోవచ్చు. ఎన్ని చేసినా ఇవన్నీ కూడా శరీరాన్ని తప్పించి మన మనసును తాకలేవు. మనసును కూడా స్పృశించి.. శరీరాన్నీ, మనస్సునూ సమతౌల్యంలోకి తెచ్చే అమోఘ పనితనం.. ఒక్క ‘యోగాభ్యాసానికి’ మాత్రమే ఉంది. అసలు ‘యోగా’ అంటే అర్థం ఇదే! యోగమన్న శబ్దం ‘యుజ్‌’ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టుకొచ్చింది. దీనర్థం.. కలయిక, ఐక్యం, జత చేయటం అనే! ఈ దేహాన్నీ, మనస్సునూ ఒక గాడిలో పెట్టి.. రెంటినీ సమతౌల్యంలోకి తెచ్చేదే యోగా! యోగా అంటే ఒక్క శారీరక ఆసనాలే కాదు. యోగాసనాలు ఎంతో కీలకమైనవీ, ముఖ్యమైనవేగానీ.. దీనికి తోడుగా శ్వాసపై శ్రద్ధ, ధ్యానం వంటివి కూడా జత చేసి… ‘ప్రాణ శక్తి’ని ఉత్తేజితం చెయ్యటం, దాన్ని పొదివిపట్టుకోవటం.. యోగా ప్రత్యేకత. అందుకే యోగాకు ఉన్న సమగ్రత, సంపూర్ణత్వం మరే ఇతర, సాధారణ వ్యాయామాలకూ ఉండవు. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా ఇప్పుడు యోగమంటే మోహం పెంచుకుంటోంది. యోగాను ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. అయితే ఇది పూర్తి ఫలితాలు ఇవ్వటానికి కొన్ని పద్ధతులు పాటించటం తప్పనిసరి…..

* రాత్రి త్వరగా పడుకొని తెల్లవారుజామున లేచి.. కాలకృత్యాలు తీర్చుకొని, పళ్లు తోముకొని స్నానం చేశాక యోగాభ్యాసం ఆరంభించాలి.
* స్నానం చేయకపోయినా యోగాభ్యాసం చేయొచ్చు. అయితే యోగా ముగిసిన కొద్దిసేపటి తర్వాత స్నానం చేయాల్సి ఉంటుంది.
* యోగాసనాలను పరగడుపున చేయటం మంచిది. ఒకవేళ భోజనం చేస్తే 4-5 గంటల తర్వాతే చేయాలి. అల్పాహారం తీసుకుంటే 2-3 గంటల సేపు ఆగాకే ఆరంభించాలి.
* యోగాసనాలు వేసేటప్పుడు వదులైన దుస్తులను ధరించాలి. పాదాలకు చెప్పులు, బూట్ల వంటివి ధరించ కూడదు.
* గాలి, వెలుతురు వచ్చే ప్రశాంతమైన ప్రదేశంలో.. లేదా కిటికీలు, తలుపులు తెరిచి ధారాళంగా వెలుతురు వస్తున్న గదుల్లో.. సమతలంగా ఉన్నచోట యోగా చేయాలి.
* ఉదయం సూర్యుడి కిరణాలు పడే ప్రాంతంలో యోగా చేయటం ఎంతో మేలు.
* తివాచీ గానీ, దుప్పటి గానీ, శుభ్రమైన వస్త్రాన్ని గానీ పరిచి దాని మీద కూచొని యోగాభ్యాసం చేయాలి. నేల మీద, గచ్చు మీద, బండల మీద చేయకూడదు.
* యోగా చేస్తున్నప్పుడు మల, మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే బలవంతాన వాటిని ఆపుకోకూడదు. విసర్జనకు వెళ్లి వచ్చాకే యోగా తిరిగి సాగించాలి. అలాగే త్రేన్పులు, తుమ్ములు, దగ్గు వంటి వాటినీ ఆపుకోవటం తగదు. దాహం వేస్తే కొద్దిగా నీళ్లు తాగొచ్చు.
* త్వరత్వరగా కాకుండా నెమ్మదిగా, అలసట లేకుండా తాపీగా యోగా చేయాలి. ఒకవేళ అలసిపోతే శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.
* యోగసాధన వీలైనంత వరకూ రోజూ చెయ్యాలి.
* మనసును పూర్తిగా ఆసనాల మీదే కేంద్రీకరించాలి. యోగాభ్యాస సమయంలో ఇతర ఆలోచనలను మనసులోకి రానివ్వద్దు.
* యోగా చేయటం ముగిశాక తప్పకుండా మూత్రవిసర్జన చేయాలి.