కోలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఐశ్వర్య రాజేష్. ఆమె పలు తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. కాగా ఐశ్వర్య ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నారని, ఈ ఏడాదిలో వీరి వివాహం జరగబోతోందని కొన్ని రోజుల క్రితం వదంతులు వచ్చాయి. తన సినిమాలో సహ నటుడి పాత్ర పోషించిన వ్యక్తితో ఆమె డేటింగ్‌లో ఉందని రాసుకొచ్చారు. అయితే ఈ వార్తలపై ఐశ్వర్య స్పష్టత ఇచ్చారు. ‘నా ప్రియుడు ఎవరో కాస్త చెప్పండి’ అని ట్వీట్ చేశారు. ‘నా ప్రేమ కథ గురించి కొన్ని వదంతులు విన్నాను. దయచేసి నా ప్రియుడు ఎవరో కాస్త చెబుతారా.. తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది. ఇలాంటి తప్పుడు వార్తల్ని ప్రచారం చేయడం దయచేసి ఆపండి. ఏదైనా జరిగితే ముందు నేనే మీకు చెబుతా. నేను సింగిల్‌గా సంతోషంగా ఉన్నా’ అని ఆమె ట్వీట్ చేశారు. కళాశాలలో ఉన్నప్పుడు ఓ వ్యక్తిని ప్రేమించినట్లు ఇటీవల ఐశ్వర్య చెప్పారు. ‘ఇంటర్ చదువుతున్నప్పుడు ఓ వ్యక్తిని ప్రేమించా. కానీ అతడు నన్ను ఛీట్ చేసి, వెళ్లిపోయాడు. ఇప్పుడు అతడు నన్ను చూసి బాధపడుతుంటాడు’ అని అన్నారు. ఐశ్వర్య చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళంతోపాటు దాదాపు పది ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధన్ తీస్తున్న సినిమాకు ఆమె సంతకం చేశారు. ‘కౌశల్య కృష్ణమూర్తి’, ‘మిస్ మ్యాచ్’ అనే సినిమాల్లోనూ నటిస్తున్నారు.
అతడెవరో మీరే చెప్పాలి
Related tags :