అమెరికాలో ఉన్న ప్రముఖ తెలుగు సంఘాలు నిర్వహించే ద్వైవార్షిక మహాసభల్లో రాజకీయ నాయకులు ప్రధానాకర్షణగా పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. నాట్స్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో వచ్చే 24వ తేదీ నుండి నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాలకు రాజకీయ నాయకులు దాదాపుగా ఎవరూ హాజరు కారనే విషయం స్పష్టమవుతోంది. పాపం నాట్స్ నిర్వాహకులు ఈ విషయాన్ని ముందుగా ఊహించి ఉండరు. ఆ మహాసభల ప్రారంభానికి 24గంటల ముందే ఆంధ్ర రాష్ట్రం ఎన్నికల ఫలితాలు వెలువడటంతో పాటు నూతన ప్రభుత్వం కూడా కొలువు తీరనుంది. తెలంగాణాలో కూడా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతొ ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి రాజకీయ నాయకులు ఎవరూ నాట్స్ సభలకు హాజరు కావడం లేదని వెల్లడి అవుతోంది. గతంలో నాట్స్ నిర్వహించిన సభల్లో సినీనటులతో పాటు రాజకీయ నాయకులు కూడా పెద్దసంఖ్యలో పాల్గొని ఆ సభలకు కళ తీసుకువచ్చేవారు. ఈ పర్యాయం ఆ పరిస్థుతులు కనిపించడం లేదు. గతంలో జరిగిన నాట్స్ సభలకు నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు తరచుగా హాజరయ్యారు. ఈసారి మాత్రం రాజకీయ వాసన నాట్స్ సంబరాల్లో కనిపించడం లేదు. దీన్ని ఊహించిన నాట్స్ కార్యవర్గం రాజకీయ నాయకులు లేని లోటును సినీనటులతో భర్తీ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా సినీ కళాకారులతో మూడురోజుల కార్యక్రమాలను రూపొందించింది. 24 రాత్రి ఆర్.పీ.పట్నాయిక్, 25 రాత్రి మనో, 26వ తేదీ రాత్రి ముగింపు కార్యక్రమంగా కీరవాణిల సంగీత విభావరులు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు పెద్దసంఖ్యలో సినీనటులను ఈ సభలకు తీసుకురావడానికి నాట్స్ కార్యవర్గం ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఎంత మంది సినీ నటులు వచ్చినప్పటికీ రాజకీయ నాయకులు లేని మహాసభలు అందునా అమెరికాలో రక్తి కట్టబోవనడంలో సందేహం లేదు. ఏదైనా దారితప్పి ఒకరిద్దరు రాజకీయ నాయకులు ఈ సభలకు వస్తారేమో వేచి చూద్దాం. —కిలారు ముద్దుకృష్ణ
రాజకీయ సందడి లేని నాట్స్ సంబరాలు-TNI ప్రత్యేకం
Related tags :