Sports

అతడే వారసుడు

Ponting names Shreyas Ayyar as gambhirs replacement

దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడని ఆ జట్టు కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. క్వాలిఫయర్‌-2లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడిపోవడంతో ఫైనల్‌ చేరాలన్న కలలను దిల్లీ నిజం చేసుకోలేకపోయింది. జట్టు ఓడినా సరే.. ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రం అద్భుతంగా జట్టును నడిపించాడని పాంటింగ్‌ ప్రశంసించాడు. ‘దిల్లీ జట్టుకు గతేడాది అనుభవజ్ఞుడైన గౌతం గంభీర్‌ కెప్టెన్‌గా ఉండేవాడు. అయితే, గంభీర్‌కు దీటుగా శ్రేయస్‌ సారథ్య బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాడు. గౌతీ లేని లోటును శ్రేయస్‌ పూరించాడు. అతని నిజమైన వారసుడిగా శ్రేయస్‌ తనవంతు పాత్ర సంపూర్ణంగా పోషించాడు. తన బాధ్యతను నిర్వర్తించే సమయంలో ఏమాత్రం ఒత్తిడికి గురయ్యేవాడు కాదు’ అని పాంటింగ్‌ తెలిపాడు. దిల్లీ క్యాపిటల్స్‌ మూడో స్థానంతో ఐపీఎల్‌ 12వ సీజన్‌కు ముగింపు పలికింది. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గానే గాక ఇటు బ్యాటింగ్‌లోనూ రాణించాడు. 16 మ్యాచుల్లో 463 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధశతకాలున్నాయి. అంతకుముందు కోచ్‌ పాంటింగ్‌ గురించి కూడా శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడాడు. ‘పాంటింగ్‌.. మాతో ఎంతో సానుకూల దృక్పథంతో ఉండేవారు. ప్రతీ మాట మాలో ఉత్సాహాన్ని నింపేలా మాట్లాడేవారు. కుర్రాళ్లతో నిండి ఉన్న మా జట్టుకు రికీ, గంగూలీ ఇద్దరూ కలిసి ముందుకు ఎలా దూసుకెళ్లాతో నేర్పించారు. పాంటింగ్‌ కోచ్‌గా ఉన్న జట్టులో ఆడటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అతనో లెజెండ్‌. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆయన మాట్లాడిన తర్వాత ఇతరులు మాట్లాడేందుకు ఏమీ ఉండేది కాదు. అనవసరమైన మాటలు ఆయన మాట్లాడరు’ అని శ్రేయస్‌ పేర్కొన్నాడు.