Devotional

వైభవంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

TTD Makes Solid Arrangements For Govinda Raja Swamy Brahmotsavam

తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, మూలవిరాట్‌తోపాటు వాహనసేవలను భక్తులు సంతృప్తిగా దర్శించుకునేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు చేశామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. శ‌నివారం ఉదయం 10.30 నుండి  మ‌ధ్యాహ్నం 12.00 గంటల మద్య క‌ట‌క‌ లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఆనంతరం శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది. అంతకుముందు ఉద‌యం 8.30 నుండి 10.00 గంట‌ల వ‌ర‌కు శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీభూ సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మూెత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది. ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ  మే 15న గరుడ వాహనం, మే 18న రథోత్సవం, మే 19వ తేదీన చక్రస్నానం జరుగుతాయని వివరించారు. వాహనసేవల సమయంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకున్నామన్నారు. ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించామన్నారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణ, భ‌ద్రాత కొర‌కు టిటిడి విజిలెన్స్ విభాగం, స్థానిక పోలీస్‌వారి స‌హ‌కారంతో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్రాత ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. భక్తులకు అన్నప్రసాదాలు, వాహన సేవల్లో మజ్జిగ, తాగునీరు పంపిణీ చేస్తున్నట్టు తెలియజేశారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో వాహనసేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన కళాకారులతో భజనలు, కోలాటాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఉద‌యం, రాత్రి స్వామివారి వాహ‌న‌సేవ‌ల‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌క్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబిసీ ద్వార ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌న్నారు. ఆల‌యంలో రోజురోజుకు పెరుగుతున్న భ‌క్తుల ర‌ద్ధీ దృష్ట్యా రూ.1.4 కోట్ల‌తో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు. అదేవిధంగా గ‌ర్భాల‌య ఆనంద గోపురానికి బంగారు మ‌లం ఏర్పాటు చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప‌నులు ప్రారంభించిన‌ట్లు తెలిపారు. ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా మ‌ధ్యాహ్నం 1.00 నుండి 2.00 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ జరగనుంది. ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, కంకణభట్టార్‌ శ్రీఎ.పి.శ్రీనివాసదీక్షితులు, విజివో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌, ఎవిఎస్వో శ్రీ రాజేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి 8 గంటల నుండి 9.30 గంటల వరకు పెద్దశేషవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. వాహనరూపంలో శ్రీగోవిందరాజ స్వామిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు ప్రబోధిస్తున్నారు.