టాటా, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు చిన్నకార్లలో డీజిల్ ఇంజిన్లకు దూరం అవుతుంటే హోండా మాత్రం కొనసాగనుంది. బీఎస్-6 నిబంధనల అమలు తర్వాత డీజిల్ ఇంజిన్ల తయారీ ఖరీదైన వ్యవహారంగా మారిపోనుంది. దీంతో చాలా కంపెనీలు డీజిల్ ఇంజిన్లు తయారు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మరో పక్క హోండా మాత్రం బీఎస్-6 కఠిన నిబంధనలను ఎదుర్కొనేలా డీజిల్ ఇంజిన్లను అప్‌గ్రేడ్ చేయనుంది. ప్రస్తుతం హోండా రెండు రకాల డీజిల్ ఇంజిన్లను వినియోగిస్తోంది. అమేజ్, సిటీ, డబ్ల్యూ-వీ, బీఆర్-వీ, సివిక్, సీఆర్-వీ వంటి మోడళ్లలో దీనిని వాడుతోంది. ఈ ఏడాది చివరి నుంచే హోండా తన పెట్రోల్, డీజిల్ మోడళ్లలో సరికొత్త బీఎస్-6 ఇంజిన్లను అమర్చనుంది. ‘‘మా కస్టమర్లలో చాలా మంది డీజిల్, పెట్రోల్ ఇంజిన్ల ఎంపికలో చాలా స్పష్టంగా ఉంటారు. వారు రోజువారి తిరిగే దూరం, వారికి పెట్టుబడిపై రాబడి మొత్తం అంచనా వేసుకొని ఇంజిన్లను నిర్ణయిస్తారు. కేవలం 20 శాతం మందే భావోద్వేగాలతో నిర్ణయించుకొంటారు.’’ అని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ రాజేష్ గోయల్ తెలిపారు. వచ్చే ఏడాది బీఎస్-6 నిబంధనలు అమల్లోకి రాగానే పెట్రోల్, డీజిల్ మోడళ్ల మధ్య ధరల్లో వ్యత్యాసం కూడా భారీగా పెరిగిపోతుందని గోయల్ అభిప్రాయపడ్డారు. డీజిల్ కార్లు ఇప్పట్లో అదృశ్యమయ్యే పరిస్థితి లేదని తెలిపారు. మార్కెట్ డిమాండ్‌కు తగినట్లు తాము డీజిల్ కార్లను విక్రయిస్తామని పేర్కొన్నారు.
మా డీజిల్ పొగ ఆగదు
Related tags :