Sports

ధోనీని తీసి తోసేసిన సెహ్వాగ్

Sehwag doesnt even care to mention Dhoni

ఐపీఎల్‌ ఆఖరి దశకు చేరుకున్న నేపథ్యంలో భారత మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు. ఈ జట్టు దాదాపు అనిల్‌కుంబ్లే ప్రకటించిన జట్టులాగే ఉంది. అయితే, వీరూ తన జట్టులో భారత మాజీ కెప్టెన్‌ ధోనీతో పాటు ప్రస్తుత కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మకు కూడా చోటు ఇవ్వలేదు. ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోహ్లీ నేతృత్వంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లలో ఏ ఒక్క ఆటగాడినైనా వీరూ తీసుకోకపోవడం గమనార్హం. అయితే, తన జట్టులో ఆటగాళ్ల ఎంపికపై వీరూ వివరణ ఇచ్చాడు. ఆటగాళ్ల గత రికార్డులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఈ ఏడాది ప్రదర్శన ఆధారంగా మాత్రమే జట్టును ఎంపిక చేశానని వీరూ తెలిపాడు. అయితే, ఈ ఏడాది తనను అమితంగా ఆకట్టుకున్న ఆటగాడు మాత్రం రిషభ్‌పంత్‌ అని ప్రకటించాడు. వీరూ తన జట్టులో ఆస్ట్రేలియన్‌ ఆటగాడు, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ ఓపెనర్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్‌గా తీసుకున్నాడు. మిడిల్‌ ఆర్డర్‌లో రిషభ్‌పంత్‌, రసెల్‌, హార్దిక్‌ పాండ్య అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నాడు. బౌలింగ్‌ విభాగంలో అత్యుత్తమ బౌలర్లుగా బుమ్రా, రబాడా రాణిస్తున్నారని అందుకే వాళ్లను తీసుకున్నానన్నాడు. ఇక స్పిన్‌ విభాగంలో యువ స్పిన్నర్లు రాహుల్‌ చాహర్‌, శ్రేయస్‌ గోపాల్ ఈ ఏడాది బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని పేర్కొన్నాడు. కోహ్లీ, డివిలియర్స్‌ను ఎందుకు తీసుకోలేదంటే.. వాళ్లిద్దరూ ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు అందుకే వాళ్లను పక్కనపెట్టాల్సి వచ్చిందని తెలిపాడు. వీరూ జట్టులో ఇద్దరు వికెట్‌ కీపర్లు, నలుగురు ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌, ఇద్దరు ఆల్‌ రౌండర్లు, ఇద్దరు ప్రధాన పేస్లరు, ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.

*** సెహ్వాగ్‌ ప్రకటించిన 2019 ఐపీఎల్‌ జట్టు..
డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, జానీ బెయిర్‌స్టో, కేఎల్‌ రాహుల్, రిషభ్‌పంత్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, అండ్రూ రసెల్‌, శ్రేయస్‌ గోపాల్‌, రాహుల్‌ చాహర్‌, కగిసో రబాడా, జస్ప్రీత్‌ బుమ్రా.