Business

నాతో బేరాలొద్దు. నాదంతా Fixed Price!

Trump wanrs China not to prolong trade tariff discussions

చైనాపై ట్రంప్‌ ఒత్తిడిని కొనసాగిస్తున్నారు.. ఒప్పందం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం చైనాకు రాదని ఆయన పేర్కొన్నారు. ఒక వేళా బేరాలను కొనసాగించి తన రెండో విడత అధ్యక్ష పదవి చేపట్టిన సమయంలో చర్చలు చేపడితే ఈ మాత్రం ఆఫర్లు కూడా చైనాకు దక్కవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుండబద్దలు కొట్టారు. ఇంత కంటే దారుణమైన ఒప్పందంపై చైనా సంతకం చేయాల్సి ఉంటుందన్నారు. అమెరికా-చైనాల మధ్య బుధవారం చేపట్టిన చర్చలు ఎటువంటి ఫలితం తేలకుండానే శుక్రవారం ముగిశాయి. దీనిపై చైనా ప్రతినిధి మాట్లాడుతూ మరోసారి బీజింగ్‌లో చర్చలు చేపడతామని వెల్లడించారు. కానీ, ఎప్పుడు చర్చలు చేపట్టేది వెల్లడించలేదు. దీనిపై ట్రంప్‌ స్పందించారు. ‘‘ఇటీవల చర్చల్లో చైనా వారు బాగా దెబ్బతిన్నట్లు ఉన్నారు. అందుకనే 2020లో వచ్చే ఎన్నికల వరకు వేచిఉండాలని నిర్ణయించుకొన్నట్లున్నారు. అప్పుడు డెమక్రాట్లు గెలిస్తే వారికి అదృష్టం కలిసివస్తుందని భావిస్తున్నారనుకొంటా. అప్పుడు వారు అమెరికా నుంచి 500 బిలియన్‌ డాలర్ల లబ్ది పొందే అవకాశం ఉందనుకుంటున్నారు. కానీ, ఇక్కడో సమస్య ఉంది. నేను మళ్లీ గెలవబోతున్నాను. అప్పుడు చైనాకు ఇప్పుడున్నంత అనుకూలంగా అప్పుడు డీల్‌ ఉండదు. అందుకనే వారు తెలివిగా వ్యవహరించి ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలి.’’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ముగింపు పలికేలా ఓ ఒప్పందంపై చర్చలు తుదిదశకు చేరాక ఇప్పుడు సుంకాల కొరడా ఝుళిపించారు. ఫలితంగా 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా వస్తువులకు అదనపు సుంకాలు అంటుకున్నాయి. టారీఫ్‌ల పరిధిలోకి రాకుండా మిగిలిపోయిన 300 బిలియన్‌ డాలర్ల వస్తువులపై కూడా 25శాతం సుంకాలు విధించాలని అధికారులను ట్రంప్‌ పురమాయించారు.