అమెరికా అంతటా కొన్ని రాష్ట్రాల సమూహంగా తానాకు పలు ప్రాంతీయ విభాగాలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ విభాగాలు స్థానిక ప్రవాసులను ఒకేతాటిపైకి తీసుకు వచ్చి సేవా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తుంటారు. ఇదే క్రమంలో 2017-19 మధ్య తానా-మిషిగన్ విభాగం నిర్వహించిన కార్యక్రమాలు అమెరికాలో ప్రవాసుల సమైక్యతా భావానికి అద్దం పట్టాయి. తానా స్వతంత్ర కార్యక్రమాలతో పాటు స్థానికంగా సేవలందిస్తున్న డెట్రాయిట్ తెలుగు సంఘంతో కలిసి సంయుక్తంగా రెండేళ్ల వ్యవధిలో ఎన్నో కార్యక్రమాలను ఈ విభాగం విజయవంతంగా నిర్వహించింది. 2017 సెయింట్ లూయిస్ తానా సభల అనంతరం ఇండియన్ ఐడల్ రోహిత్ సంగీత విభావరితో తానా-మిషిగన్ ఆధ్వర్యంలో ప్రవాసులకు ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీనితో పాటు ఈ దిగువ కార్యక్రమాలను ఈ విభాగం నిర్వహించింది…
* చిన్నారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు క్యూరీ గణిత సాంకేతిక పోటీలు
* జన్మభూమిలో అభివృద్ధి కార్యక్రమాలకై 5కె రన్
* అమెరికా పాఠశాలల్లో పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగుల(Backpacks) పంపిణీ
* ఆపద సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడే రక్తదాన శిబిరాలు
* “ప్రేరణ” పేరిట మహిళలకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో తెలుగు వారికి విశేష సేవలందించిన ప్రవాస ప్రముఖుల సతీమణులను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో తానా తరఫున దేవినేని లక్ష్మీ తదితరులతో పాటు స్థానికంగా ఉన్న 400మందికి పైగా మహిళలు ఉల్లాసంగా పాల్గొన్నారు.
మాజీ అధ్యక్షురాలు మన్నే నీలిమ, ప్రస్తుత అధ్యక్షుడు బచ్చు సుధీర్‌ల సహకారంతో స్థానికంగా ఉన్న డెట్రాయిట్ తెలుగు సంఘంతో కలిసి సంయుక్తంగా ఈ రెండేళ్లల్లో 16 క్రీడా పోటీలను నిర్వహించి 2000 మందికి పైగా క్రీడాకారులకు పతకాలు, ప్రశంసాపత్రాలను ఈ విభాగం అందజేసి అమెరికాలో ప్రవాస తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీల చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. వాలీబాల్, బాస్కెట్‌బాల్, చిత్రలేఖనం, త్రోబాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి పోటీల్లో ప్రతి విభాగంలో 150కు పైగా ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు.
డెట్రాయిట్‌లోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో 2015 తానా సభలకు ముఖ్య అతిథిగా హాజరయిన భారత ఉప-రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతులమీదుగా తానా ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇందులో డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్(DTLC) ఆధ్వర్యంలో ఓ గ్రంథాలయాన్ని తానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి దానికి ప్రతి ఏటా $1000 డాలర్లను నిర్వహణ నిధులుగా అందిస్తున్నారు. ఈ గ్రంథాలయ నిర్వహణను కూడా తానా-మిషిగన్ విభాగం పర్యవేక్షిస్తుంది. ఆలయ కార్యవర్గ సహకారంతో తెలుగు కళావైభవం పేరిట సంగీత, నాట్య ప్రదర్శనలు, డా.శోభారాజు ఆధ్యాత్మిక సంగీత కచేరీ, కళారత్న కె.వి.సత్యనారాయణ కూచిపూడి నాట్య ప్రదర్శన వంటి కార్యక్రమాల ద్వారా అమెరికాలో తెలుగు ఆధ్యాత్మిక పరిమళాల వ్యాప్తికి మిషిగన్ తానా విభాగం ఎనలేని కృషి జరిపింది. మిషిగన్ రాష్ట్రంలోని అన్ని భారతీయ సంఘాలకు ముఖ్య ప్రతినిధిగా నిలబడే ఇండియన్ లీగ్ ఆఫ్ అమెరికా(ILA) స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్‌లో సైతం తానా శకటానికి చోటు దక్కింది.
“అమెరికాకు భారతీయులు అందులో తెలుగువారు ఎక్కువగా రావడం వలన ప్రవాస తెలుగు సంఘాల సంఖ్య కూడా అదే రీతిలో గడిచిన దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగింది. ప్రవాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్నీ తెలుగు సంఘాలు ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. కానీ ఎవరికి వారే యమునా తీరే లాగా కాకుండా అందరినీ కలుపుకుపోతూ సమైక్యతా భావానికి తానా గొడుగుపడుతుందనే స్ఫూర్తిని పరిచయం చేస్తూ తానా మిషిగన్ విభాగం గడిచిన రెండేళ్లల్లో ఎన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలను నిర్వహించి ప్రవాసులకు మరింత చేరువ అయింది. ఇదే పంథాలో మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తూ రానున్న కాలంలో మా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి మిషిగన్ తానాను మరింతగా బలోపేతం చేస్తాం.” అని మిషిగన్ తానా ప్రాంతీయ ప్రతినిధి పంత్ర సునీల్ పేర్కొన్నారు. డా.బండ్ల హనుమయ్య, నాదెళ్ల గంగాధర్, శృంగవరపు నిరంజన్, యార్లగడ్డ శివరాం, మారెంరెడ్డి సాగర్, చాపలమడుగు ఉదయ్, కోనేరు శ్రీనివాస్, పెద్దిబోయిన జోగేశ్వరరావు వంటి వారి విలువైన సలహాలు, సూచనలతో దుగ్గిరాల కిరణ్, వెలగా శుభకర్, వంశీ కారుమంచి, మన్నే నీలిమ తదితరులు కలిసి ఓ బృందం కన్నా కూడా కుటుంబంగా కలిసి మెలిసి మిషిగన్ తానా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. ఇన్ని కార్యక్రమాల నిర్వహణ వెనుక తన శ్రీమతి ప్రియ తోడ్పాటు అమూల్యమైనదని సునీల్ పేర్కొన్నారు.
*** దడదడలాడించిన డెట్రాయిట్ తానా సేన – ₹3కోట్ల విరాళాలు
జులై 4,5,6 తేదీల్లో నిర్వహించబోయే ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభల నిర్వహణ నిధుల కార్యక్రమాన్ని శనివారం నాడు డెట్రాయిట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రవాసులు ₹3కోట్లు($4,01,000 డాలర్లు) విరాళాలు ప్రకటించారు. ఈ నిధుల సేకరణ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు వేమన సతీష్, సభల చైర్మన్ డా.కొడాలి నరేన్‌లు సంయుక్తంగా హాజరయ్యారు. ఇంతటి భారీ సంఖ్యలో నిధులు అందించినందుకు అతిథులకు వారు ధన్యవాదాలు తెలిపారు. తానా 22వ మహాసభలను ప్రవాసులు, తెలుగువారు ఆశ్చర్యపోయేలా, గర్వకారణమైన రీతిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధీంతానా ఆధ్వర్యంలో స్థానిక ప్రవాస చిన్నారులు బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.