సెలవురోజు ఎవరైనా ఏంచేస్తారు.. అప్పటివరకూ చవిచూసిన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు సినిమాలు.. షికార్లకు సిద్ధమవుతారు. కానీ ఉన్నత చదువులు చదివి కార్పొరేట్ కొలువులు చేపట్టిన కొంతమంది యువతీ, యువకులు మాత్రం ఆరోజు స్వయంగా గరిటె పట్టుకుంటున్నారు. తామే స్వయంగా కాయగూరలు తరిగి వంటలు సిద్ధం చేస్తారు. ఇదంతా తాము తినేందుకు కాదండోయ్. అర్ధాకలితో కాలం వెళ్లదీసేవారిలో కొందరికైనా ఒక్కరోజు కడుపు నిండా రుచికరమైన భోజనం అందించాలనేది తమ ఉద్దేశం అంటున్నారు. ఎదుటివారి కష్టాన్ని చూసి జాలి చూపటంకంటే తమవంతు సాయం అందించటంలో ఎంతో తృప్తి దొరుకుతుందంటున్నారీ కుర్రాళ్లు. హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి కొనుగోలు చేసి పంచుతుంటారు. మరికొన్ని సంస్థలు.. వివాహ వేడుకలు, శుభకార్యాల్లో మిగిలిన పదార్థాలను సేకరించి నగరవ్యాప్తంగా ఫుట్‌పాత్‌లపై జీవనం కొనసాగించే వారికి పంపిణీ చేస్తుంటారు. దీనికి భిన్నంగా కార్పొరేట్ సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది.. వారాంతపు సమయాలు, పండుగలు, సెలవురోజుల్లో తామే స్వయంగా వంటలు చేసి రుచి, శుచి రెండూ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉండే నిరుపేదలు.. రహదారి పక్కన గూడు కట్టుకుని బతుకీడ్చే అభాగ్యుల ఆకలి తీరుస్తున్నారు. వంటింటి వైపు తొంగి చూడాలంటే ఎవరికైనా బద్దకమే. సెలవు దొరికితే చాలు ఇంటిల్లిపాదీ హోటళ్లకు వెళ్లటం పరిపాటిగా మారింది. ఆకలేసినప్పుడు యాప్‌లో ఆర్డరిస్తే క్షణాల్లో కోరుకున్న ఆహార పదార్థాలు గుమ్మం ముందుకు చేరుతున్నాయి. ఇటువంటి వెసులుబాటున్నా.. పర్సు నిండా పైసలున్నా.. మనసులో ఏదో వెలితి. ఎన్ని సరదాలను ఆస్వాదించినా వచ్చే సంపాదనలో కొంత సేవా కార్యక్రమాలకు వెచ్చించే యువతకు నగరంలో లోటు లేదు. బడి పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం కొనిస్తూ తమ సేవానిరతిని చాటుకుంటారు. మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రులు, కూడళ్ల వద్దకు ఆహార పొట్లాలు పంచిపెడుతూ రోగులకు సపర్యలు చేసేందుకు వచ్చే బంధువులు, స్నేహితుల ఆకలి తీర్చుతున్నారు. కార్తికేయ అనే చిరుద్యోగి.. రోజూ విధులకు వెళ్తూ 2 క్యారేజీలతో భోజనం తీసుకెళతాడు. రహదారి పక్కన ఎవరైనా వృద్ధులు కనిపిస్తే వారికి ఇచ్చేస్తాడు.. బాబూ ఆకలవుతోంది.. అన్నం పెట్టించు అంటూ.. ఓరోజు వృద్ధురాలు అడిగిన సందర్భం ఈ ఆలోచనకు కారణమైందన్నారు. చేతినిండా సొమ్ములు.. వారాంతపు వేళ జల్సాలు.. ఇప్పటి యువతపై అధికశాతం మందిలో వినిపించే మాటలు. కానీ ఇవన్నీ దురభిప్రాయం నిరూపిస్తున్నారీ యువకులు. అక్షయ్‌కుమార్, మనోజ్, అరూప్, సాయిదీప, వరుణ్, కిరణ్ ఆశ్లిన్ వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగ వేటలో హైదరాబాద్ చేరినవారే. ఒకేచోట ఉద్యోగాలు చేస్తున్న వీరిని కలిపింది మాత్రం తోటివారికి సహాయం చేయాలనే సుగుణమే అంటాడు కిరణ్. పండగల వేళ ఈ స్నేహబృందం ఒకచోటకు చేరుతుంది. మార్కెట్‌కు వెళ్లి అన్నీ కొనుగోలు చేస్తారు. కూరగాయలు కోయటం, అన్నం వండటం, ఉప్పు, కారం అన్నీ సమపాళ్లలో ఉండేలా రుచికరమైన భోజనాలను సిద్ధం చేస్తారు. ఎందుకీ శ్రమ.. హోటల్‌లో కొనివ్వవచ్చని ఎవరైనా సలహా ఇస్తే.. ఇంట్లో అమ్మ చేతి వంట రుచి ఏ స్టార్‌హోటల్‌లో దొరుకుతుందని ప్రశ్నిస్తాడు ఐటీ నిపుణుడు కార్తీక్. ఇటీవల వెజ్ బిర్యానీ, హల్వా స్వయంగా చేసినట్లు చెప్పారు. అంత రుచికరమైన వంటను.. తాను తినకుండా.. బిడ్డ నోటికి అందిస్తూ ఆ తల్లి ఎంతగొప్ప అనుభూతికి లోనైందనేది దగ్గరగా చూసిన తమకు చాలా ఆనందంగా అనిపించిందన్నారు. అంతే కాదండోయ్.. ‘ఉయ్ కెన్ మేక్ ఏ ఛేంజ్’ సంస్థ ద్వారా ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేశారు. నగరంలో రహదారి మధ్య ప్రమాదకరంగా కనిపించే గుంతలు పూడ్చుతూ శ్రమదానం కూడా చేస్తుంటారు.
పేదల ఆకలి తీరుస్తున్న హైదరాబాదీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
Related tags :