‘ఈ సారి కప్ నమదే’ అంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌ను ఆరంభించి చతికిల పడ్డ సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవడంతో మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కాగా బెంగళూరు అభిమానులు మాత్రం ఆ జట్టుకు పూర్తి మద్దతుగా నిలిచారు. అలాంటి అభిమానుల్లో ఒకరే దీపికా ఘోష్. సహజంగా అయితే ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఆర్సీబీ ఫాన్ గర్ల్ అంటే మాత్రం ఐపీఎల్ అభిమానులందరికీ ఠక్కున గుర్తొస్తుంది. అంతలా మాయ చేసింది ఈ అమ్మాయి. ఒక్క మ్యాచ్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిన ఆటగాళ్లను ఎంతో మందిని చూసుంటాం. కానీ ఒక్కసారి టీవీ క్లిప్పింగ్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయ్యిందంటే మాత్రం అది దీపిక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా తనకు లభించిన గుర్తింపు పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత పేరు, సమాచారం నెటిజెన్లకు తెలియడంతో మనస్థాపం చెంది ఇన్‌స్టాగ్రామ్‌లో బాధపడుతూ ఓ పోస్టు పెట్టింది. ‘నా పేరు దీపిక ఘోష్, ఇదొక్కటే నా అసలైన గుర్తింపు. ఎన్నో ఏళ్లుగా నేను ఐపీఎల్‌లో ఆర్సీబీకి అభిమానిగా ఉన్నా. అలాగే ఈ ఏడాది కూడా ఉన్నా. మే 4న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు అభిమానిగా మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చా. ఆ మ్యాచ్‌లో నేను ప్రత్యేకంగా కనపడాలని కోరుకోలేదు. నా కెలాంటి గుర్తింపు అక్కర్లేదు. నేను సెలబ్రిటీని కాదు అందరిలాగే నేనూ సాధారణ అమ్మాయిని. టీవీలో నా క్లిప్పింగ్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. ఇది నాకు అనవసరం. నా గురించి గర్వంగా చెప్పుకొనేది నాకు చాలా ఉంది’ అని పేర్కొంది. ‘నేనొక కష్టపడే ఉద్యోగిని, నాకంటూ కొన్ని కళలు ఉన్నాయి. నా కుటుంబీకులు, స్నేహితులు నన్ను చాలా ప్రేమిస్తారు. అయితే ఈ మ్యాచ్ తర్వాత నా జీవితం మారిపోయిందని చాలా మంది భావిస్తున్నారు. ఎలా మారిపోయిందని అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే నాకు కల ఏమీ లేదు. కేవలం నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య పెరగడం తప్ప నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. మీలాగే నేను ఆశ్చర్యపోతున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. కానీ చాలా మంది నన్ను అకారణంగా దూషిస్తున్నారు. అది నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. చాలా మానసికక్షభకు గురౌతున్నా. నా పేరు, ప్రొఫైల్ జనాలకి ఎలా తెలిసిందో అర్థంకావడం లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే చాలా మంది మహిళలు కూడా నన్ను తిట్టిపోస్తున్నారు. ఇది మరింత కలచివేస్తోంది. చాలా మంది నన్నెందుకు ఫాలో అవ్వాలో చెప్పమంటున్నారు. అలా అడిగే హక్కు మీకుంది. కానీ ఇది జరిగిపోయింది. ఈ విషయాన్ని మరింత పెద్దగా చెయ్యకుండా అర్థవంతంగా మార్చాలనుకుంటున్నా. నేను ఆర్సీబీఅమ్మాయినే (#TheRCBGirl) కానీ అంతకన్నా ఎక్కువే’ అని తీవ్ర భావోద్వేగంతో పోస్టు చేసింది.
నా జీవితంలో కల్లోలం రేపారు
Related tags :