వైకాపా నాయకురాలు లక్ష్మీపార్వతి, నటి పూనం కౌర్‌లను సామాజిక మాధ్యమాల్లో వేధించింది ఒక్కరేనని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానళ్లలో అశ్లీల కథనాలు, అసభ్య రాతలు పోస్ట్ చేస్తున్నారంటూ లక్ష్మీపార్వతి, పూనం కౌర్ వేర్వేరుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూనం కౌర్ ఫిర్యాదులో పేర్కొన్న ఒక పేరు.. లక్ష్మీపార్వతిని వేధించిన నిందితుడి పేరు ఒకటేనని గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడితో పాటు మరో వ్యక్తి ఈ నేరంలో భాగస్వామిగా ఉన్నాడని తెలుసుకున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో వాళ్లు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం సేకరించారు. లక్ష్మీపార్వతిపై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి, పూనం కౌర్‌పై గత 8 నెలలుగా అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల కథనాలను పోస్ట్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారా? వ్యక్తిగత కక్షతో చేస్తున్నారా? అనేది వారు పట్టుబడ్డాకే తెలుస్తుందని ఒక పోలీసు ఉన్నతాధికారి వివరించారు.
ఇద్దరినీ వేధించింది ఒక్కడే!
Related tags :