1. ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షల ఫలితాలను మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో కమిషనర్ సంధ్యారాణి విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634 మంది విద్యార్థులు పదోతరగతి చదవగా వీరిలో 99.5%మంది పరీక్షలకు హాజరయ్యారు. పదో తరగతి పరీక్షల్లో 94.88 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 94.68 శాతం, బాలికలు 95.09 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సంధ్యారాణి తెలిపారు.
2. ‘థర్డ్ ఫ్రంట్’కు అవకాశం లేదు: స్టాలిన్
లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, భాజపాయేతర కూటమికి ఎలాంటి అవకాశాలు లేవని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు. కాంగ్రెస్, భాజపాయేతర ప్రాంతీయ పార్టీల సమాఖ్య కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మరుసటి రోజే స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుంది. సమాఖ్య కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్ నిన్న చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, ఇందు కోసం తాను చేస్తున్న ప్రయత్నానికి మద్దతు పలకాలని కేసీఆర్ కోరారు.
3. ఏడేళ్ల క్రితమైతే నాన్న జవాబిచ్చేవారు
తన తండ్రిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్. 26/11 ఉగ్రదాడి జరిగినప్పుడు దివంగత మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తన కుమారుడు రితేశ్‌కు సినిమా అవకాశాలు ఇప్పించే ప్రక్రియలో బిజీగా ఉన్నారని పీయూష్ ఆరోపించారు. దీనిపై రితేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఈ లోకంలో లేని వ్యక్తి గురించి మీరు ఇలా ఆరోపించడం సరికాదు. ఏడేళ్ల క్రితమే మీరు ఈ ప్రశ్న అడిగి ఉంటే మా నాన్న సమాధానం ఇచ్చేవారు. మీ ఎన్నికల ప్రచారాలకు ఆల్ ది బెస్ట్ సర్’ అని పేర్కొన్నారు రితేశ్.
4. జెట్ ఎయిర్‌వేస్‌కు షాక్
రుణ సంక్షోభంతో తాత్కాలికంగా మూతబడిన ప్రయివేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు మరో షాక్ తగిలింది. కంపెనీ డిప్యూటీ సీఈవో, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో) అమిత్ అగర్వాల్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన కంపెనీ నుంచి తప్పుకున్నట్లు జెట్ వెల్లడించింది. ‘మే 13న కంపెనీ డిప్యూటీ సీఈవో, సీఎఫ్‌వో అమిత్ అగర్వాల్ వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకున్నారు’ అని రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది. అయితే ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది జెట్ ఇంకా వెల్లడించలేదు. అమిత్ 2015లో సీఎఫ్‌వోగా కంపెనీగా చేరారు.
5. అమెరికాలో మరోసారి కాల్పులు
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మిస్సోరీలోని సెయింట్ లూయీస్ నగరంలో గల ఓ ఇంట్లోకి దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ష్రెవె 4000 బ్లాక్‌లోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇంటి ముందు ఓ వ్యక్తి, ఇంట్లో మరో నలుగురు బుల్లెట్ గాయాలతో కన్పించారు. వీరిలో ముగ్గురు అప్పటికే మృతిచెందగా.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.
6. రాజీనామా చేయండి..డబ్బు తీసుకోండి..!
ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎవరైన తన ఉద్యోగానికి రాజీనామా చేసి డెలివరీ ఏజెన్సీని ప్రారంభిస్తే వారికి 10,000 డాలర్లను ఖర్చుల కింద ఇస్తుంది. అమెజాన్ డెలివరీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. అలా రాజీనామా చేసిన ఉద్యోగికి మూడునెలల వేతనాన్ని కూడా ఇచ్చేస్తారు. అమెజాన్ డెలివరీ సమయాన్ని రెండు రోజుల నుంచి ఒక్కరోజుకు తగ్గించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాజీనామా చేసిన ఉద్యోగులు నీలిరంగ్ వ్యాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనిపై అమెజాన్ స్మైలీ బొమ్మను పెట్టుకోవాల్సి ఉంటుంది.
7. శ్రీలంక అల్లర్లలో ఒకరి మృతి
శ్రీలంకలో చెలరేగిన ముస్లిం వ్యతిరేక ఘర్షణలు చివరకు ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాయి. అల్లర్లు రోజురోజుకీ తీవ్ర రూపం దాలుస్తుండడంతో అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటుండడం గమనార్హం. ఆదివారం సాయంత్రం పుట్టలం జిల్లాలో చెలరేగిన అల్లర్లు.. సోమవారం సాయంత్రానికి కొలంబో సరిహద్దులోని మరో మూడు జిల్లాలకు వ్యాపించాయి. ఆదివారం పలు ముస్లిం వ్యాపారుల దుకాణాలే లక్ష్యంగా ప్రారంభమైన దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
8. ఊగిసలాట ధోరణిలో స్టాక్ మార్కెట్
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఊగిసిలాట ధోరణిలో ఉన్నాయి. ఉదయం 9.47 సమయంలో సెన్సెక్స్ 43పాయింట్ల లాభంతో 37,133 వద్ద, నిఫ్టీ 27పాయింట్ల నష్టంతో11,120 వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం కారణంగా మార్కెట్లలో ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే అమెరికా చైనాకు చెందిన 200 బిలియన్ డాలర్ల వస్తువులపై టారీఫ్‌లను పెంచడంతో చైనా కూడా దీనికి ప్రతీకారంగా అమెరికాకు చెందిన 60 బిలియన్ డాలర్ల వస్తువులపై టారీఫ్‌లను పెంచింది. ఇది జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఎల్‌అండ్‌టీ, టాటాస్టీల్, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీలు అత్యధికంగా నష్టపోయాయి.
9. హీరోగా వీవీ వినాయక్..!
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వినాయక్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తుండడంతో అభిమానులు సర్‌ప్రైజ్‌కు గురయ్యారు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శంకర్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్. నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఈయన ‘శరభ’ అనే సినిమాను తెరకెక్కించారు. మరో రెండు నెలల్లో చిత్రీకరణ ప్రారంభం అవుతుందని చిత్రవర్గాలు వెల్లడించాయి.
10. వన్‌ప్లస్ 7 ఫోన్లపై జియో భారీ ఆఫర్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ ఈ రోజు భారత విపణిలోకి వన్‌ప్లస్ 7 సిరీస్ మొబైల్స్‌ను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా రిలయన్స్ జియో భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల కొనుగోలుపై రూ.9,300 విలువైన ప్రయోజనాలను వినియోగదారులకు అందించనుంది. వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్7ప్రో స్మార్ట్‌ఫోన్‌లలో జియో నెట్‌వర్క్ వినియోగించే వారు రూ.299తో తొలి రీఛార్జ్ చేసుకుంటే, వోచర్ల రూపంలో రూ.5,400 ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రూ.150 విలువైన 36 వోచర్లు మై జియో యాప్‌లోకి వచ్చి చేరతాయి