వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్ నాలుక కోయాలంటూ రాష్ట్ర పాడిపరిశ్రమల శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాత్యుని వ్యాఖ్యలను టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి ఖండించారు. తూత్తుకుడిలో సోమవారం మంత్రి రాజేంద్ర బాలాజీ విలేకరులతో మాట్లాడుతూ.. స్వాతంత్య్ర భారత తొలి తీవ్రవాది ఓ హిందువంటూ కమల్‌హాసన్ మాట్లాడారని, ఆయన కొవ్వెక్కిన నాలుకను కోయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నాలుకపై శని ఉందని, హిందువులు అత్యాధికులుగా ఉన్న ఊరిలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. తీవ్రవాదికి మతం లేదని, వారిని తీవ్రవాదులుగానే పరిగణించాలన్నారు. మైనారిటీల ఓట్ల కోసం హిందువుల గురించి మాట్లాడిన కమల్‌హాసన్ నాలుకను వారే ఎప్పటికైనా కోస్తారన్నారు. హిందూ మతం పవిత్రమైందని, ఇతర మతాల కన్నా ప్రాచీనమైందని, ఈ మతాన్ని విమర్శించడాన్నే కొందరు పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ద్రావిడర్ కళగం అధ్యక్షుడు కె.వీరమణి హిందూ సంప్రదాయాలను అవమానిస్తున్నారని, ఆ తర్వాత ఓట్ల కోసం విబూది రాసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం వారితో కమల్ కూడా చేరారన్నారు. ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని కమల్ పార్టీని రద్దు చేయాలని, ఆ పార్టీ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన స్టాలిన్ ప్రస్తుతం కేసీఆర్‌తో మూడో ఫ్రంట్ అంటూ చర్చలు జరుపుతున్నారని, ఇవి కూటమికి పాతరేసే చర్యలని ధ్వజమెత్తారు. కూటమి పార్టీలోని వారిని ఓడించడమే డీఎంకే పని అని, దానిని స్టాలిన్ చేస్తున్నారని విమర్శించారు. విశ్వసనీయతలేని పార్టీకి నిదర్శనం డీఎంకే అని, ఆ పార్టీకి రాష్ట్రంలో ప్రజాధరణలేదన్నారు. నేతగా పళనిస్వామి రూపాంతరం చెందారని, పార్టీని, పాలనను ఆయన చక్కగా నిర్వహిస్తున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి రాజేంద్ర బాలాజీ వ్యాఖ్యలను టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి తీవ్రంగా ఖండించారు. కమల్‌హాసన్ హిందూ తీవ్రవాదం గురించి మాట్లాడటం తప్పయితే.. నాలుక కోస్తానంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు సరైనవేనా..? అని ప్రశ్నించారు. అదీ తీవ్రవాదమేనని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయం కలిగినవారిని నాశనం చేయాలనే విషయంలో ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్, హిందూ మహాసభ వంటివి చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. చెన్నై: కమల్‌హాసన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేంద్ర బాలాజీని మంత్రి పదవి నుంచి తప్పించాలని ఎంఎన్‌ఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కమల్‌హాసన్ నాలుక కోయాలన్న మంత్రి వ్యాఖ్యలు ఖండించదగినవన్నారు. ఆయన వ్యాఖ్యలు పదవిని చేపట్టే సమయంలో చేసిన ప్రమాణాన్ని అతిక్రమిస్తున్నాయన్నారు. అందువల్ల ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. మంత్రి రాజేంద్ర బాలాజీ వ్యాఖ్యలను టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి ఖండించడం, మంత్రి పదవి నుంచి తప్పించాలని ఎంఎన్‌ఎం డిమాండ్ చేయడం వంటి పరిణామాలతో రాజేంద్ర బాలాజీ కొంత మెత్తబడ్డారు. నాలుక కోస్తానని చెప్పిన వెంటనే కోసేస్తామా..? అని అన్నారు. అంతా సోదరభావంతో కలిసి ఉంటున్న సమయంలో తీవ్రవాదాన్ని ప్రేరేపించేలా కమల్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఐసిస్ దగ్గర డబ్బులు తీసుకుని వారికి తొత్తుగా మారారా..? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఆయన వ్యాఖ్యల్లోని లోగుట్టును కేంద్ర నిఘా సంస్థలు బయట పెట్టాలని కోరారు. ప్రజల మనోభావం ప్రతిబింబించేలా కమల్ నాలుక కోస్తానని మాట్లాడానని పేర్కొన్నారు. కమల్ పశ్చాత్తాపపడి క్షమాపణ కోరితే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంపై ఆలోచిస్తానని ఆయన అన్నారు. తనను మంత్రి పదవి నుంచి తప్పించాలని కోరే హక్కు కమల్‌కు లేదన్నారు.
నాలుక కోయాల్సిందే
Related tags :