ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఓ యువతిని ఆమె కన్నతండ్రే రూ. పదివేలకు ఓ వ్యక్తికి విక్రయించాడు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆమెతో బలవంతంగా ఇండ్లలో వెట్టిచాకిరీ చేయించాడు. ఆ ఇండ్లలో వాళ్లు అనేకమార్లు ఆమెపై సామూహిక లైంగికదాడి చేశారు. తనకు జరుగుతున్న అన్యాయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో విసిగివేసారిన బాధిత మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. 80 శాతం కాలిన గాయాలతో ఘజియాబాద్ దవాఖానలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) స్పందించింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించిన హపూర్ జిల్లా పోలీసుల తీరుపై దర్యాపు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. బాధిత మహిళ పట్ల యూపీ పోలీసుల వ్యవహరించిన తీరు క్షమించలేని విధంగా ఉందని పేర్కొన్నారు. పోలీస్ అధికారుల ప్రవర్తన సిగ్గుపడేలా ఉందని, తన ఫిర్యాదు పట్టించుకోకపోవడంతో బాధితురాలు నిప్పంచుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపారు. డీసీడబ్ల్యూ రాసిన లేఖ ప్రకారం.. యూపీలోని హపూర్‌లో అనేక మంది దగ్గర అప్పులు తీసుకున్న ఓ వ్యక్తికి బాధిత మహిళను రూ.10 వేలకు ఒకరు విక్రయించారు. సదరు వ్యక్తి రుణదాతల ఇండ్లలో డబ్బులు చెల్లించకుండా సదరు మహిళతో బలవంతంగా పనులు చేయించేవాడు. ఆయా ప్రాంతాల్లో ఆమెను దారుణంగా దూషించడమేకాకుండా బాధిత మహిళపై అనేకసార్లు సామూహిక లైంగికదాడులు పాల్పడ్డారు. తన మీద జరుగుతున్న దారుణాలపై హపూర్ పోలీస్ సూపరింటెండెంట్‌తోపాటు సీనియర్ అధికారులను కలిసి ఆమె ఫిర్యాదుచేసినా వారు కేసు నమోదు చేయలేదు. నిందితులపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఏప్రిల్ 28న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధిత మహిళకు సరైన నష్టపరిహారం చెల్లించాలని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ యూపీ సీఎంకు సూచించారు. డీసీడబ్ల్యూ జోక్యంతో యూపీ పోలీసులు బాబుగఢ్ సర్పంచ్‌తోపాటు మరో 13 మందిపై లైంగికదాడి కేసు నమోదుచేశారు. కానీ, ఎవరినీ కూడా ఇంత వరకు అరెస్టుచేయలేదు. మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హపూర్ ఎస్పీ తెలిపారు. తన ఫిర్యాదును పోలీసులు తీసుకోవడానికి నిరాకరించినందునే బాధిత మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే అంశాన్ని తిరస్కరించారు.
మహిళను ₹10వేలకు కొని…లైంగిక దాడి చేసిన 13మంది
Related tags :