ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్‌కు గాయమైంది. దాంతో ఆయన నటిస్తున్న ‘జేమ్స్ బాండ్’ 25వ సినిమా చిత్రీకరణను నిలిపివేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జమైకాలో జరుగుతోంది. ఆయన సెట్‌లో పరిగెడుతున్నప్పుడు కిందపడిపోయారు. కాలికి తీవ్ర గాయడం కావడంతో డేనియల్ చాలా బాధపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆయన్ను అమెరికాకు తీసుకెళ్లారని ఓ బ్రిటిష్ వార్తా పత్రిక తెలిపింది. త్వరలో లండన్‌లోని ప్రతిష్ఠాత్మక పైన్‌వుడ్ స్టూడియోస్‌లో తదుపరి షెడ్యూల్‌ను చిత్రీకరించాల్సి ఉంది. గాయం కారణంగా ఆ చిత్రీకరణ భాగాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. డేనియల్ నటించే సినిమాల్లో దాదాపు స్టంట్లన్నీ డూప్ లేకుండా ఆయనే చేస్తారు. దాంతో చాలా సార్లు గాయాలపాలయ్యారు. ‘జేమ్స్ బాండ్’గా నటించిన తొలి చిత్రం ‘క్యాసినో రాయల్’ చిత్రీకరణ సమయంలో డేనియల్ స్టంట్స్ చేస్తున్నప్పుడు కిందపడి ఆయన పళ్లు ఊడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ డేనియల్ కోలుకుని తన స్టంట్ సన్నివేశాలు తానే పూర్తిచేశారు. ‘జేమ్స్ బాండ్’ సిరీస్ నుంచి వస్తున్న 25వ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమాకు కేరీ దర్శకత్వం వహిస్తున్నారు. జమైకా, నార్వే, లండన్, ఇటలీలో సినిమాను చిత్రీకరించాల్సి ఉంది. సినిమాలో అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు మళ్లీ బాండ్‌ను విధుల్లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే కథ ఉండబోతోందని హాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
#Bond25 ఆగిపోయింది
Related tags :