రాష్ట్ర సమాచార కమీషనర్‌గా ఐలాపురం రాజా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమాచార కమీషనర్‌గా ఐలాపురం రాజాతో ప్రమాణ స్వీకారం చేయించారు. సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సమాచార కమీషనర్లను నియమించగా ఇటీవల మరో కమీషనర్‌గా ఐలాపురం రాజాను సమాచార కమీషనర్‌గా నియమించగా సిఎస్ సుబ్రహ్మణ్యం ఆయనతో సమాచార కమీషనర్‌గా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర సమాచార కమీషన్‌కు వస్తున్న ఫిర్యాదులు తదితర అంశాలపై ఆరా తీశారు. ఏఏ శాఖలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయో ఆయా శాఖలకు సంబంధించి ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించాలని ఆయన కమీషనర్లకు సూచించారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పధకాలు, కార్యక్రమాలు, ప్రభుత్వ సహాయంతో నడిచే అన్ని రకాల విభాగాలకు చెందిన కార్యకలాపాల అమలుకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలు తెల్సుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అదే ఈ చట్టం ముఖ్య ఆశయమని సిఎస్ పేర్కొన్నారు. ఆ దిశగా సమాచార కమీషన్ మరింత సమర్ధవంతంగా పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించాలని సిఎస్ సుబ్రహ్మణ్యం ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సమాచార కమీషనర్లు యం.రవికుమార్, కె.జనార్ధన్, నూతన సమాచార కమీషనర్‌గా ప్రమాణం చేసిన ఐ.రాజా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణస్వీకారం చేసిన ఐలాపురం రాజా
Related tags :