నైరుతి రుతుపవనాలు జూన్ 6న కేరళలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బుధవారం వెల్లడించింది. సాధారణంగా మన దేశంలో ఏటా జూన్ 1న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జులై రెండో వారానికి దేశమంతా వ్యాపిస్తాయి. అయితే ఈ సారి ఐదు రోజులు ఆలస్యం కానున్నట్లు ఐఎండీ తెలిపింది. ‘నైరుతి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యం కానుంది. మే 18-19న అండమాన్, నికోబార్ దీవుల మీదుగా రుతుపవనాల రాక మొదలవుతుంది. నాలుగు రోజులు అటు ఇటుగా జూన్ 6న కేరళను తాకి దేశంలోకి ప్రవేశిస్తాయి’ అని ఐఎండీ అంచనా వేస్తోంది. కాగా.. నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళలోకి ప్రవేశించనున్నాయని ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ మంగళవారం తెలిపిన విషయం తెలిసిందే. ఈసారి వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువ నమోదు కానుందని స్కైమెట్ అంచనా వేసింది. వాయువ్య, దక్షిణ భారతదేశ ప్రాంతాలతో పోలిస్తే తూర్పు, ఈశాన్య, మధ్యభారతాల్లో తక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పసిఫిక్ సముద్రంపై వేడిగాలుల కారణంగా ఈసారి ‘‘ఎల్‌నినో’’ వచ్చే అవకాశం 55శాతం ఉందని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఆలస్యం
Related tags :