ScienceAndTech

భారత్‌పై పాక్ ఫేక్ న్యూస్ దాడి

Pakistan Attacks India With Fake News-Mission Eleven

భారత్‌పై అసత్య ప్రచారానికి పాక్‌కు చెందిన మాజీ జనరల్స్‌ సమాచార యుద్ధానికి తెర తీశారు. ఫిబ్రవరి 26వ తేదీన బాలాకోట్‌పై దాడులు జరిగిన తర్వాత పాక్‌కు చెందిన ఎనిమిది ట్విటర్‌ ఖాతాల నుంచి అసత్య సమాచారం వెల్లువెత్తింది. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన ఒక సంస్థ వెల్లడించింది. ఈ ఖాతాల నుంచి వచ్చే సమాచారంతో ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఏర్పడింది. మసూద్‌ అప్పగింతకు ఒత్తిడి పెరిగిన సమయంలో ఒక తప్పుడు వార్త వచ్చింది. మార్చి 2వ తేదీన మసూద్‌ అజార్‌ మృతి చెందినట్లు వీటి నుంచే ప్రచారం మొదలైంది. దీనిని ఒక ఆంగ్ల మీడియాహౌస్‌ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ పోస్టు చేసింది. తొలుత భారత మీడియా కూడా దీనిని వాస్తవమని నమ్మింది. ఆ తర్వాత మళ్లీ తప్పును సరిచేసుకొంది. ఆ తర్వాత మార్చి4వ తేదీన భారత వైమానిక దళం ఫోర్ట్‌ అబ్బాస్‌, సియాల్‌కోట్‌పై దాడి చేశాయని ఒక్కసారిగా విషప్రచారం చేశాయి. ఎఫ్‌.జెఫ్రీ పేరుతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో దీనిని ప్రచారంలోకి తెచ్చాయి. కొన్ని ట్విటర్‌ ఖాతాలు ఈ ప్రచారం చేస్తున్న విషయాన్ని హైదరాబాద్‌కు చెందిన ‘గ్రేట్‌ గేమ్‌ ఇండియా’ సంస్థ గుర్తించింది. వీటిని పాకిస్థాన్‌ మాజీ జనరల్స్‌ నిర్వహిస్తున్నట్లుగా తెలుసుకొంది. అసలు పుల్వామా దాడి జరిగిన తర్వాత నుంచి కొన్ని అనుమానాస్పద ట్విటర్‌ ఖాతాలపై నిఘా ఉంచింది. అప్పట్లో పెద్దగా హడావుడి చేయని ఈ ఖాతాలు బాలకోట్‌పై దాడి తర్వాత మాత్రం ఒక్కసారిగా సచేతనమైపోయాయి. ఒక్కసారిగా తప్పుడు సమాచారాన్ని అంతర్జాలంలోకి తీసుకురావడం మొదలుపెట్టాయి. పూర్తి గందరగోళ వాతావరణం సృష్టించి ఉద్రిక్తతలను పెంచేందుకు ప్రయత్నించాయి. ‘కశ్మీర్‌ ఇంటెల్‌’ పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతా విష ప్రచారం మొదలుపెట్టింది. భారత సైన్యం ఫిర్యాదు చేయడంతో ట్విటర్‌ దీనిని బ్లాక్‌ చేసింది. లండన్‌లోని ఇస్లామిక్‌ థియాలజీ ఆఫ్‌ కౌంటర్‌ టెర్రరిజం దక్షిణాసియా డెస్క్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా చెప్పుకొంటున్న ఫరాన్‌ జెఫ్రీ పేరుతో ఉన్న ఖాతా కూడా భారత్‌పై విషప్రచారానికి దోహదపడింది. ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. వాస్తవానికి జెఫ్రీ పాక్‌లోని వ్యూహాత్మక సంస్థ ‘కమాండ్‌ ఎలెవన్‌’ కోసం పనిచేస్తున్నారు. కమాండ్‌ ఎలెవన్‌ అనేది పాకిస్థాన్‌కు చెందిన ఒక విషప్రచార సంస్థ. సమాచార యుద్ధతంత్రలో ఆరితేరిన పాకిస్థానీ రిటైర్డ్‌ జనరల్స్‌ దీనిని నిర్వహిస్తున్నారు. ఇది సమాచార యుద్ధం కోసం ఒక వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తోంది. భారత్‌ పాక్‌ ఉద్రిక్తల సమయంలో కమాండ్‌ ఎలెవన్‌ నుంచి భారీగా తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చింది. దీనిని ఎదుర్కోవడానికి భారత్‌కు 60గంటల సమయం పట్టింది.