Politics

నాకు కాంగ్రెస్ బలమైన మద్దతు ఇచ్చింది

Sumalatha Says She Was Supported By Congress

మండ్య లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ పోటీ ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి సుమలత తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం బెంగళూరు నగరంలో తాను నటించిన ‘డాటర్‌ ఆఫ్‌ పార్వతమ్మ’ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. ‘గెలుపుపై రోజుకో సమీక్ష వస్తోంది. నేను వాటిని అంతగా పరిగణించను. గెలుపోటములపై నాకు ఎటువంటి చింతలేదు. గెలుస్తానన్న విశ్వాసం మాత్రం ఉంది’ అని విశ్లేషించారు. అతిగా విశ్వసించినా బాధపడాల్సి వస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన సుమలత.. ‘రెబెల్‌స్టార్‌ అంబరీశ్‌ పోటీ చేసిన సమయంలో ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. నేను పోటీ చేసిన ఎన్నికల ఫలితాలు కాబట్టి కాస్త కుతూహలంగా ఉండడమూ సహజమే. నేను కాంగ్రెస్‌ నాయకులతో పాల్గొన్న విందు అంశాన్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదు. కేవలం ఓ జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగానే నేను ఆ విందులో పాల్గొన్నా. గెలిచినా, ఓడినా మండ్యలో ఇల్లు మాత్రం కట్టుకుంటా. నాకు కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేసిన విషయం దాచుకోవాల్సిన అంశం కాదు. వారికి వారే బహిరంగంగా ప్రకటించి మరీ నాకు సహకరించారు’ అని స్పష్టం చేశారు. ఓ వైపు తనయుడు నిఖిల్‌ కుమారస్వామి గెలుపు కోసం ముఖ్యమంత్రి కుమారస్వామి దేవాలయాల సందర్శన చేస్తుంటే- సుమలత ఏమాత్రం పట్టనట్లు విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం ఆసక్తిగొలిపే అంశం.