మనదేశంలో ఆడపిల్లలపై ప్రతి ఇరవై నిమిషాలకో అత్యాచారం జరుగుతోందని ఓ అంచనా. సాంఘిక దురాచారాలతో అమ్మాయిలపై హింస రోజు రోజుకీ పెరుగుతోందని పోలీసు రికార్డులే చెబుతున్నాయి. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలంటే సామాజిక అవగాహన అవసరం. మహిళలు తమని తాము కాపాడుకునే ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవడం ముఖ్యం. విద్యా, ఉపాధి రంగాల్లో నిలదొక్కుకునే సాధికారత అంతకన్నా కీలకం. ఇవన్నీ వారికి అందించేందుకే పనిచేస్తోంది సేఫ్టీ సంస్థ. ఇందుకోసం వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మహిళల రక్షణ, సాధికారతకోసం నిధుల సేకరణ చేయాలనుకుంది ఈ సంస్థ. ఆ విషయాల గురించి ఆ సంస్థ నిర్వాహకురాలు శ్రుతి మాట్లాడుతూ ‘తాజాగా ఓ మహిళ అమ్మాయిల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఆమె తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పినా.. మన సమాజంలో చాలామంది అదే అభిప్రాయంతో ఉన్నారు. బాధితులపై నిందలు వేయడం ద్వారా అత్యాచారాలు ఆగవు. సమాజం ఆలోచించే విధానం మారాలి. అందుకే మా ఈ ప్రయత్నం’ అని అంటోందామె. ఆ ప్రచారంలో భాగంగా అమ్మాయిల శరీరాన్ని పూర్తిగా కప్పేసే చీరల్ని ప్రత్యేకంగా తయారుచేయించిందీ సంస్థ. వాటికి వ్యంగ్య వ్యాఖ్యానాలు జతచేసి ప్రదర్శనకు ఉంచింది. వీటి పేరు సూపర్ సంస్కారీ చీరలు. ‘వీటిని చూసి ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలి. వారి భద్రతకు తగిన రక్షణ కల్పించాలి’ అని చెబుతుంది శ్రుతి.
సూపర్ సంస్కారీ చీరలు
Related tags :