ఏడేళ్ల చింటూ ఉదయమే బడికి వెళ్లాడు. ఇంట్లో అతని భోజనాల టేబులు మీద రెండు డబ్బాల్లో చాక్లెట్లు, లాలీపాప్‌లు ఉన్నాయి. చింటూ అలా బడికి వెళ్లగానే చాక్లెట్లు, లాలీపాప్‌ల మధ్య తగాదా మొదలయింది. అవి వాదనకు దిగాయి.
‘చింటూ ఇంటికి రాగానే తినడానికి నన్నే తీసుకుంటాడు. నేనెంతో తీపిగా ఉంటాను తెలుసా?’ అంది చాక్లెటు గర్వంగా.
‘చాలు… చాలువే… నేనూ నీలాగే తీపిగా ఉంటాను. చింటూ నన్నే ఎంచుకుంటాడు’ అంది లాలీపాప్.
‘అదేం కాదు. నేను ఎంతో మెత్తగా ఉంటాను. నోట్లో వేసుకోగానే కరిగిపోతాను. అందుకే చింటూకి నేనంటే చాలా ఇష్టం’ అంది చాక్లెటు.
‘నేనేం తక్కువ తిన్నానా? లాలీపాప్ అనగానే చింటూ కావాలని ఎగబడతాడు. నీలాగ చిటికెలో కరిగిపోను. ఎంతోసేపు చింటూ నోటిలో నాట్య మాడతాను’ అంది లాలీపాప్.
‘చాల్లే… నీ వాగుడు ఆపు. నేను పాలతో తయారు అవుతాను. ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు. నాలో కొన్ని పప్పు పదార్థాలు కూడా ఉంటాయి. అవి కూడా ఒంటికి మంచిది’ అంది చాక్లెటు.
‘పనికిరాని వాదన ఎందుకు… కాసేపటిలో చింటూ బడి నుంచి వస్తాడు కదా చూద్దాం. ఎవరిని తీసుకుని తింటాడో!’ అంది లాలీపాప్.
అవి రెండూ చింటూ కోసం ఆతృతగా ఎదురు చూడసాగాయి. అంతలో చింటూ బడి నుంచి వచ్చాడు. పుస్తకాల సంచీ పక్కన పడేశాడు.
‘అమ్మా ఆకలి వేస్తోంది. తినడానికి ఏమైనా పెట్టు’ అని అరిచాడు.
భోజనాల టేబులు మీద చూడు. నీకేం కావాలో తీసుకుని తిను’ అంది అమ్మ. చింటూ టేబులు దగ్గరికి పరుగు తీశాడు.
ముందు చాక్లెటును చేతిలోకి తీసుకున్నాడు. అటూ ఇటూ తిప్పాడు. చాక్లెటు ముఖం విప్పారింది. చింటూ చాక్లెటును డబ్బాలో పడేశాడు. లాలీపాప్‌ను తీసుకున్నాడు. లాలీపాప్ ఆనంద పడింది. చింటూ లాలీపాప్‌ను కూడా డబ్బాలోకి విసిరేశాడు.
టేబులు మీద అమ్మ పెట్టిన పండ్ల బుట్ట చూశాడు చింటూ. ఆపిల్ పండ్లు నిగనిగలాడుతూ మంచి వాసన వస్తున్నాయి. చింటూకి నోరు వూరింది. బడిలో టీచరు చెప్పిన మాటలు చింటూకి గుర్తుకు వచ్చాయి.
‘చాక్లెట్లు, లాలీపాప్‌లు తినటం వల్ల నోటిలోని పళ్లు పుచ్చిపోతాయి. పిజాలు, బర్గర్లు తింటే ఆరోగ్యం చెడుతుంది. అందుకే రోజూ పండ్లు తినాలి. ఆపిల్ తింటే మంచి శక్తి వస్తుంది’ అని చెప్పింది టీచర్.
చింటూ నిగనిగలాడుతున్న ఆపిల్‌ని తీసుకుని కొరికాడు. ‘అబ్బా… ఎంతో రుచి… ఎంతో రుచి ఆపిల్ పండు’ అంటూ పాటపాడాడు.
చాక్లెటు, లాలీపాప్‌ల ముఖాలు చిన్నబోయాయి. తమ ఇద్దరిలో ఎవరినీ చింటూ తిననందుకు దిగులు పడ్డాయి. చింటూ ఆపిల్ తింటున్నందుకు అమ్మ ఆనందపడింది.
‘భోజనాల టేబులు మీద పిల్లలకు కనపడేలా పండ్ల బుట్ట పెట్టండి’ అని సలహా ఇచ్చిన టీచరును మనసులోనే మెచ్చుకుంది అమ్మ.