Editorials

తేదీ దగ్గరపడుతోంది. వెన్నులో వణుకు మొదలవుతోంది–TNI ప్రత్యేకం

Who will win 2019 election results in andhra-a review - 2019 election results - తేదీ దగ్గరపడుతోంది. వెన్నులో వణుకు మొదలవుతోంది–TNILIVE ప్రత్యేకం

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగి అప్పుడే 35 రోజులు గడిచిపోయాయి. ఓట్ల లెక్కింపుకు ఇంకా కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. వచ్చే గురువారం ఇదే సమయానికి కొన్ని గంటల ముందే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీనా?, రాహుల్ గాంధీనా? అనే విషయం తేలే సమయం ఆసన్నమయింది.

*** ఎవరికి వారే మేకపోతు గాంభీర్య ప్రదర్శన
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే కొనసాగుతారా? లేదా వై.ఎస్.జగన్‌కు అధికారం దక్కుతుందా? అనే విషయం కూడా అదే రోజున తెలబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. డబ్బు, మద్యం ఏరులై పారింది. ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో పోటీలో ఉన్న అభ్యర్థి ₹50కోట్లకు పైనే ఖర్చుపెట్టారు. జేసీ దివాకరరెడ్డి ఈ విషయాన్ని బహిరంగంగానే అంగీకరించారు. అసెంబ్లీ బరిలో నిలిచిన అభ్యర్ధులు ₹20కోట్ల వరకు ఖర్చుపెట్టారు. మంగళగిరి, గుడివాడ, చీరాల వంటి అసెంబ్లీ స్థానాల్లో ₹30కోట్లకు పైనే ఒక్కొక్క అభ్యర్ధి ఖర్చు చేశారు. ఈసారి ఎన్నికల్లో వచ్చే ఫలితాల గురించి తలపండిన రాజకీయ పరిశీలకుల సైతం అంచనాలు వేయలేకపోతున్నారు. తెదేపా, వైకాపా పార్టీల వారు తామే అధికారంలోకి వస్తామని బీరాలు పలుకుతున్నప్పటికీ ఓటమిపై ఇరు పార్టీల వారిని అంతర్గతంగ భయం వెన్నాడుతోంది. వైకాపా నాయకులు తామే అధికారంలోకి వస్తామని భారీగా కలలు కంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అవుతున్నాడని ఆయన క్యాబినెట్‌లో మంత్రులు వీరేనంటూ ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రకటనలు సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం సడలని ధీమాతో ఉన్నారు. ఈసారి మళ్లీ అధికారం తెదేపాదే అని చంద్రబాబు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో పోటీ పడటంతో పాటు, రాజ్యంగా వ్యవస్థలతోనూ పెద్ద ఎత్తున పోరాడారు. ఎన్నికల కమీషన్‌తోను, ప్రధాని మోదీతోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నతాధికారులతోనూ ఆయన పెద్ద ఎత్తున పోరాటానికి దిగారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడం కోసం చంద్రబాబు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు వీవీప్యాట్‌ల విషయంలో సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కారు. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వచ్చే గురువారం తెలియనుంది.

*** వెన్నుపూసలో వణుకు మొదలు
ఎన్నికల అనంతరం పత్తా లేకుండా పోయిన అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్ధులు వేసవి విడిది నుండి ఊళ్లకు చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో గత నెలరోజుల నుండి విదేశాల్లో ఉల్లాసంగా గడిపిన అభ్యర్థులు స్వస్థలాలకు చేరుతున్నారు. కౌంటింగ్ ఏజెంట్ల నియమకంలోనూ వాటి ఏర్పాట్లలోనూ నిమగ్నమయ్యారు. చాలా మంది అభ్యర్ధులకు ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్ది వెన్నుపూసలో వణుకు మొదలవుతోంది. గెలుపోటములపై సన్నిహితులతో మంతనాలు ప్రారంభించారు.

*** పందేల కోసం ఎదురుచూపు
రాష్ట్రంలో ఏర్పడిన అనూహ్య రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గెలుపు, ఓటములపై పందేల రాయుళ్లు ఇప్పటి వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మే 19వ తేదీన వెల్లడయ్యే ఎగ్జిట్ పోల్స్ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ కూడా 19వ తేదీనే ఎన్నికల ఫలితంపై తన సర్వే ఫలితాన్ని వెల్లడిస్తానని ప్రకటించారు. తెలంగాణలో రాజగోపాల్ సర్వ్ ఫలితం బెడిసికొట్టింది. చాలా మంది తెలుగుదేశం, కాంగ్రెస్ కార్యకర్తలు కోట్లాది రూపాయలు తెలంగాణ ఎన్నికల్లో కోల్పోయారు. ఈ పర్యాయం లగడపాటి సర్వే ఫలితాన్ని ప్రజలు ఎంత వరకు విశ్వసిస్తారో వేచి చూడవలసి ఉంది. గ్రామాల్లో మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం వేచి చూడకుండా చిన్న చిన్న పందేలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ఓట్ల లెక్కింపు అనంతరం తమ అంచనాలు నిజమవుతాయో, లేక తారుమారవుతాయో అనే విషయంపై రాజకీయ పరిశీలకులతో పాటు సామాన్య ఓటరు కూడా వచ్చే 23వ తేదీ కోసం ఆసక్తిగా, ఆత్రుతగా, ఆందోళనగా, అయోమయంగా, ఆశగా ఎదురు చూస్తున్నారు.–కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.