Business

పసిడి ధర పడిపోయింది

gold prices drop in india but rise in  international markets-పసిడి ధర పడిపోయింది-tnilive

గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర పడిపోయింది. దేశీ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల బంగారం ధర రూ.135 తగ్గుదలతో రూ.33,260కు క్షీణించింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్‌ తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గుదలతో రూ.38,200కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ప్రతికూల ప్రభావం చూపింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధర తగ్గితే అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి ధర పెరిగింది. గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.20 శాతం పెరుగుదలతో 1,298.95 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌ కు 0.11 శాతం పెరుగుదలతో 14.82 డాలర్లకు ఎగసింది. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.135 తగ్గుదలతో రూ.33,260కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.135 తగ్గుదలతో రూ.33,090కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,500 వద్ద స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గుదలతో రూ.38,200కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.50 క్షీణతతో రూ.37,510కు తగ్గింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగింది.