‘భారత్’ చిత్రంలో తనకు చిన్న పాత్ర ఇచ్చారని అందుకే ప్రచార కార్యక్రమాలకు హాజరుకాలేకపోతున్నానని అంటున్నారు ప్రముఖ నటి టబు. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న ‘భారత్’ చిత్రంలో ఆమె నటించారు. అయితే సినిమా పోస్టర్లపై కానీ, టీజర్, ట్రైలర్‌లో కానీ, టబు ఎక్కడా కనిపించలేదు. ప్రచార కార్యక్రమాలకు కూడా రావడం లేదు. దీని గురించి పలు మీడియా వర్గాలు ఆమెను ప్రశ్నించగా.. ‘నాకు చిన్న పాత్ర ఇచ్చారు. ప్రచారానికి రాలేను. ఒక్క సన్నివేశంలో మాత్రమే కనిపిస్తాను. నేను ప్రచారానికి వస్తే మీరు సినిమా గురించి మాట్లాడమంటారు. నేను చేసిన చిన్న సీన్ గురించి ఏమని మాట్లాడగలను?’ అని వెల్లడించారు. ఈ చిత్రంలో సల్మాన్ సోదరి పాత్రలో టబు నటించారు. 2014లో వచ్చిన ‘జైహో’ చిత్రంలో కూడా టబు, సల్మాన్ అక్కాతమ్ముళ్లుగా నటించారు. అలీ అబ్బాస్ జాఫర్ ‘భారత్’కు దర్శకత్వం వహించారు. దిశా పటానీ కథానాయిక. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి 70 ఏళ్ల వరకూ దేశంతో పాటే ఎదుగుతూ నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం లాంటి ఆటుపోట్లను దాటుకుంటూ ఓ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన ‘భారత్’ అనే వ్యక్తి కథను తెరపై చూపించనున్నారు. రంజాన్ కానుకగా జూన్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం టబు ‘దే దే ప్యార్ దే’ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె అజయ్ దేవగణ్ భార్య పాత్రలో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిన్నది కాబట్టి రాలేను
Related tags :