ScienceAndTech

ఆ రోబో చేయి అమెరికాను ఆపేసింది

Tappy Robot Tech Theft By Huawei Put Up National Emergency In USA-tnilive-ఆ రోబో చేయి అమెరికాను ఆపేసింది

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చైనా విషయంలో ఏమాత్రం తప్పుపట్టడానికి వీల్లేదు. ఆయన కోపానికి కారణం ఉంది.. ఆంక్షలకు ఓ అర్థం ఉంది. ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన సాంకేతికతను చైనా తస్కరిస్తుంటే ఆయన కడుపుమండింది. అంతే.. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది. అమెరికా మేథో సంపత్తిని రక్షించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ ఏకంగా నేషనల్‌ ఎమర్జెన్సీనే విధించారు. దీనికి తోడు హువావేను అణగదొక్కేందుకు ఆంక్షల కొరడాను ఝుళిపించారు. దీంతో హువావే అమెరికా సంస్థల వద్ద ఎటువంటి టెక్నాలజీని కొనుగోలు చేయలేదు.. అంతేకాదు, అమెరికా సంస్థలు ఐటీ నేషనల్‌ ఎమర్జెన్సీ కారణంగా ఆ సంస్థతో వ్యాపారాలు చేయలేవు. ఇటీవల కాలంలో అమెరికా, చైనాల మధ్య ఎన్నడూ లేనంతగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. టెలికాం రంగంలో వినియోగించే రోబో సాంకేతికతను దొంగిలించిందనే ఆరోపణలను హువావే ఎదుర్కొంటోంది. దీంతోపాటు మరికొన్ని కారణాలు ఉద్రిక్తతను పెంచాయి. హువావే సంస్థకు టి మొబైల్స్‌ అమెరికా వ్యాపార భాగస్వామి. టి మొబైల్స్‌కు చెందిన ‘తాపీ’ అనే రోబో చేయికి సంబంధించిన సాంకేతికతను హువావే దొంగిలించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మొబైల్‌ఫోన్లను పరీక్షించేందుకు ఈ రోబోను వినియోగిస్తారు. హువావే ఉద్యోగులు కొందరు ఈ రోబో డిజైన్‌, కొలతలను తీసుకోవడంతో పాటు దీనిని ఫొటోలను కూడా చైనాకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. వీరందరికి హువావే నజరానాలు ఇచ్చిందని అమెరికా ఆరోపిస్తోంది.ఈ కుట్ర హువావే కనుసన్నల్లోనే జరిగినట్లు అమెరికా పేర్కొంటోంది. అమెరికా బ్యాంకులను మోసం చేసి ఇరాన్‌కు పలు పరికరాలను విక్రయించినట్లు హువావేపై ఆరోపణలు ఉన్నాయి. హువావే యాజమాన్యం ఉన్న ఓ కంపెనీ ఇరాన్‌ మొబైల్‌ టెలికమ్యూనికేషన్‌కు విక్రయించింది. దీనికోసం ఆ కంపెనీ ఒక అమెరికా పౌరుడిని ఇరాన్‌లో ఉద్యోగిగా నియమించింది. ఆ కంపెనీలో తనకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్న విషయాన్ని అమెరికా బ్యాంకులకు హువావే వెల్లడించలేదు. ఈ వ్యవహారం మొత్తం హువావే సీఎఫ్‌వో మెంగ్‌ వాంగ్‌ఝూ కనుసన్నల్లోనే జరిగిందని అమెరికా భావించింది. గత డిసెంబర్‌లో ఆమెను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. త్వరలోనే మెంగ్‌ను అమెరికాకు అప్పగించే అవకాశం ఉంది. మెంగ్‌ ఎవరో కాదు.. హువావే సీఈవో రెన్‌ జెంగ్‌ఫీ కుమార్తె. రెన్‌ చైనా కమ్యూనిస్టు పార్టీకి అత్యంత సన్నిహితుడు. ఆయన గతంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలో కూడా పనిచేశారు.

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో నాణ్యమైన ఫోన్లను అందించడమే లక్ష్యంగా కంపెనీలు పనిచేస్తున్నాయి. దీనికోసం భారీ మొత్తంలో పరిశోధనలకు వెచ్చిస్తున్నాయి. ఈ క్రమంలో టి-మొబైల్స్‌ సంస్థ ‘తాపీ’ పేరుతో ఒక యాంత్రిక చెయ్యిని అభివృద్ధి చేసింది. దీని వేళ్లు మనిషి వేళ్లవలే పనిచేస్తాయి. దీనిని ఉపయోగించి ఒక మొబైల్‌ ఫోన్‌ను మనిషి గంటల తరబడి ఎలా వాడతారో అలానే వినియోగించి పరీక్షిస్తారు. సరికొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి విడుదల కావాలంటే ముందు తాపీ పరీక్షించాల్సిందే. ఈ క్రమంలో టి-మొబైల్స్‌సంస్థ హువావే వంటి స్మార్ట్‌ఫోన్‌ తయారీదార్లను తన ల్యాబ్‌లో స్మార్ట్‌ఫోన్లపై పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతించింది. ఈ క్రమంలో హువావే సొంతంగా ఇటువంటి రోబోను తయారు చేయాలనుకొంది. అంతే 2012లో టి-మొబైల్‌ ల్యాబ్‌లోకి తన అమెరికా విభాగం ఉద్యోగులు ప్రవేశించి పరీక్షలు నిర్వహించుకునేలా అనుమతులు సాధించింది. ఈ ఉద్యోగులు అక్కడి సమాచారాన్ని దొంగిలించి ఇచ్చేలా ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దీంతో అక్కడి హువావే ఉద్యోగులు ఆ రోబో గురించి టి-మొబైల్స్‌ ఉద్యోగులను అడగడం మొదలుపెట్టారు. కానీ, వారు ఎటువంటి సమాచారం ఇవ్వకపోగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఒక హువావే ఉద్యోగి మెయిల్‌ రూపంలో కంపెనీకి పంపించారు. ఏప్రిల్‌ 2013నాటికి హువావే ఉద్యోగులు తమ ల్యాబ్‌లోకి రాకుండా బ్యాన్‌ విధించాలనే ప్రతిపాదనలను టి-మొబైల్స్‌ పరిశీలించింది. దీంతో హువావే తొందరపడింది. ఒక చైనా ఇంజినీర్‌ను కూడా తమ ఉద్యోగులతో కలిపి టి-మొబైల్స్‌ ల్యాబ్‌లోకి పంపించి ఫొటోలు, ఇతర సమాచారాన్ని సేకరించింది. కానీ, గుంపుగా వచ్చే హువావే ఉద్యోగులు ఏం చేస్తున్నారో టి- మొబైల్స్‌కు అర్థమైంది. దీంతో ఒక్కో ఉద్యోగిని మాత్రమే పరీక్షలు నిర్వహించే తాపీ రోబో వద్దకు పంపింది. అయినా ఒక హువావే ఉద్యోగి ఆ రోబో చేయి ఒక దానిని ఇంటికి తీసుకెళ్లి దాని నుంచి సమాచారాన్ని తస్కరించాడు. పొరపాటున దానిని తనతో పాటు తీసుకెళ్లినట్లు చెప్పి మర్నాడు టి-మొబైల్స్‌కు అప్పగించాడు. దీంతో హువావే ఉద్యోగులను టి-మొబైల్స్‌ బ్యాన్‌ చేసింది. ఆ తర్వాత సాంకేతికత దొంగతనానికి పాల్పడిన ఉద్యోగులకు హువావే నజరానాలు అందజేసిందనే ఆరోపణలు వచ్చాయి.

అమెరికా తమ దేశ కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇరాన్‌కు విక్రయించడంపై నిషేధం విధించింది. దీంతో పాటు థర్డ్‌పార్టీ దేశాలకు చెందిన వారు కూడా అమెరికా సాంకేతికతను ఇరాన్‌కు విక్రయించకూడదని ఈ నిషేధం చెబుతోంది. ఈ క్రమంలో హువావేకు చెందిన ఒక షెల్‌ కంపెనీ ఇరాన్‌కు అమెరికా సాంకేతికతను విక్రయిస్తోన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీ బోర్డులో సీఎఫ్‌వో మెంగ్‌ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో 2013లో హువావే సీఎఫ్‌వో మెంగ్‌ చెందిన ఒక బ్యాంక్‌ను కలిసి తాము ఇరాన్‌కు సాంకేతికత విక్రయించడంలేదని నమ్మబలికారు. దీంతో సదరు బ్యాంక్‌ హువావేతో లావాదేవీలను కొనసాగించింది. కానీ, అసలు విషయం కొన్నాళ్లకే బహిర్గతం కావడంతో కెనడాలో మెంగ్‌ను అరెస్టు చేశారు.