ScienceAndTech

ఒక్క సూదితో రక్త క్యాన్సర్ కనుగొనవచ్చు

Australlian researchers invent new technology to detect blood cancer with one injection

ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. కేవలం ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో రక్త కేన్సర్‌కు పూర్తిస్థాయి చికిత్స అందించేందుకు డాక్టర్‌ కెన్‌ మైక్లెథ్‌వెయిట్‌ రంగం సిద్ధం చేస్తున్నారు. కార్‌–టీ అని పిలిచే ఒక రకమైన రోగ నిరోధక కణాలను ఆధునీకరించి శరీరంలోకి ఇంజెక్షన్‌ రూపంలో ఎక్కించడం ద్వారా 70 – 80 శాతం కేన్సర్‌ కణాలను నాశనం చేయవచ్చునని డాక్టర్‌ కెన్‌ అంటన్నారు. కేన్సర్‌ కణాలు శరీర రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పి విస్తరిస్తుందని మనకు తెలుసు. ఈ సమస్యను అధిగమించేందుకు కార్‌–టీ రోగనిరోధక కణాల్లో కొన్నిమార్పులు చేస్తారు. ఫలితంగా ఈ కణాలు కేన్సర్‌ కణాలను గుర్తిండచమే కాకుండా నాశనం కూడా చేయగలవు. నిజానికి ఈ రకమైన చికిత్స అమెరికాలో ఇప్పటికే అందుబాటులో ఉంది. కాకపోతే ఖర్చు కోట్లల్లోనే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్త కెన్‌ కొత్త పద్ధతి ద్వారా కార్‌ –టీ కణాలను ఉపయోగించారు. రక్త కేన్సర్‌తోపాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ ఉన్న టాడ్‌ ఓ షియా అనే 19 ఏళ్ల యువకుడిపై జరిపిన ప్రయోగంలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. కీమోథెరపీ, ఎముక మజ్జ మార్పిడి వంటి ప్రయత్నాలు కూడా విఫలమైన తరువాత కెన్‌ తన చికిత్స ప్రారంభించారు. రోగి శరీరం నుంచి సేకరించిన కార్‌ –టీ కణాలను పరిశోధన శాలలో మార్పులు చేసి.. కేన్సర్‌ కణాలను గుర్తించేలా చేశారు. కేవలం రూ.ఏడు లక్షల ఖర్చుతో చేసిన ఓ ఇంజెక్షన్‌ నెలరోజుల్లోనే ఫలితాలు చూపడం మొదలైంది. ప్రస్తుతానికి ఇది రక్త సంబంధిత కేన్సర్లకు మాత్రమే చికిత్స అందిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఇతర కేన్సర్లకు విస్తరించే అవకాశం లేకపోలేదని అంటున్నారు డాక్టర్‌ కెన్‌.