WorldWonders

మక్కా మసీదు దురాగతానికి 12ఏళ్లు

mecca masjid bombings happened on this day 12 years ago-tnilive-telugu news international

మక్కా మసీదు పేలుళ్లు జరిగి నేటికి 12 ఏండ్లు అవుతోంది. 2007, మే 18వ తేదీన(శుక్రవారం) ముస్లిం సోదరులందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో పేలుళ్లు జరిగాయి. హుజుఖానా ప్రాంతంలో అమర్చిన ఎల్‌ఈడీ సెల్‌ఫోన్‌ ట్రిగ్రర్‌ బాంబు పేలడంతో క్షణాల్లో మసీదు ప్రాంగణమంతా రక్తపుటేరులు పారాయి. ఈ పేలుళ్లలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 58 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ పేలుళ్లు చోటు చేసుకున్న అనంతరం అక్కడ ఘర్షణలు చెలరేగాయి. శాంతి భద్రతలు అదుపుతప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు మృతి చెందారు. అయితే ప్రతి ఏడాది మే 18వ తేదీన పోలీసులు మక్కా మసీదు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 2007 మే 18వ తేదీన మధ్యాహ్నం 1.18 గంటలకు హైదరాబాద్‌లోని మక్కా మసీద్‌లో పేలుడు సంభవించింది. ఆ సమయంలో వందల మంది ప్రార్థనలు చేస్తున్నారు. పేలుడు తీవ్రతకు 14 మంది మరణించగా, 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తునకు ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేశారు. విధ్వంసకారులు మూడు ఐఈడీ బాంబులను అమర్చినట్టు సిట్ గుర్తించింది. వాటిలో ఒక దాన్ని టైమర్‌తో పేల్చగా, మరో రెండు పేలని బాంబులను నిర్వీర్యం చేశారు. పేలిన బాంబును బరువైన బండరాయి కింద పెట్టడంతో ప్రాణనష్టం పెద్దగా జరుగలేదని పోలీస్ అధికారులు తెలిపారు. కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో 2010లో సీబీఐకి అప్పగించారు. సీబీఐ లోతైన దర్యాప్తు జరిపి దేవేందర్ గుప్తా, లోకేశ్‌శర్మను సూత్రధారులుగా గుర్తించి, మరికొందరి పేర్లు జత చేస్తూ చార్జిషీట్ దాఖలు చేసింది. 2011 మే లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కేసును విచారణకు స్వీకరించి.. 10 మంది నిందితుల పేర్లతో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పదిమంది.. దేవేందర్‌గుప్తా (ఏ1), లోకేశ్‌శర్మ (ఏ2), సందీప్‌డాంగే (ఏ3), రామచంద్ర కళాసంగ్రా (ఏ4), సునీల్‌జోషి (ఏ5), స్వామి అసీమానంద్ (ఏ6), భరత్‌భాయ్ (ఏ7), రాజేందర్‌చౌదరి (ఏ8), తేజ్‌రామ్ పర్మార్ (ఏ9), అమిత్‌చౌహన్ (ఏ10)ను ఎన్‌ఐఏ నిందితులుగా పేర్కొంటూ విచారణ ప్రారంభించింది. వీరిలో సునీల్‌జోషి హత్యకుగురయ్యాడు. ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, మరో ఇద్దరిపై ఎన్‌ఐఏ చార్జిషీట్ దాఖలు చేయలేదు. మిగతా ఐదుగురిపై ఎన్‌ఐఏ 2013 జూన్‌లో చార్జిషీట్ దాఖలుచేసింది. 2018, ఏప్రిల్ 16న నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. స్వామి అసీమానంద, దేవేందర్ గుప్తా, రాజేందర్ చౌదరి, లోకేశ్ శర్మ, భరత్ భాయిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.