* వచ్చే నెల 6వ తేదీన టొయోటా గ్లాన్జాను మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనిని మారుతీ సుజుకీ బాలినోకు క్లోనింగ్‌గా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. టొయోటా సరికొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది. జూన్ 6వ తేదీన మార్కెట్లోకి ఈ కారును విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. మారుతీ సుజుకీతో ఒప్పందంలో భాగంగా టొయోటా ఉత్పత్తి చేసేందుకు అంగీకరించిన మూడు మోడళ్లలో బాలినో కూడా ఒకటి.
*కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌కు ఎస్‌అండ్‌పీ గ్లోబల్- ప్లాట్స్ గ్లోబల్ మెటల్స్ అవార్డు- 2019 లభించింది.
*రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గత జనవరిలో నియమించిన నందన్ నీలేకని కమిటీ తమ నివేదికను సమర్పించింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై నందన్ నీలేకని ఆధ్వర్యంలో ఆర్‌బీఐ అయిదుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ కార్పొరేషన్ బ్యాంక్ రూ.6,581.49 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
*ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఇండియా టూరిజమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) సంస్థల్లో ప్రభుత్వం త్వరలో తన వాటాను తగ్గించుకోవడానికి కసరత్తు చేస్తోంది.
*అరబిందో ఫార్మా షేరు ధర స్టాక్ మార్కెట్లో పతనమైంది. ఈ కంపెనీకి చెందిన మూడు ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్), ఇంటర్మీడియేట్లు తయారు చేసే యూనిట్లలో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తనిఖీ చేసి కొన్ని లోపాలు బయట పెట్టడం దీనికి ప్రధాన కారణం.
*బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు వెళ్లని ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫినో పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా కిరాణా షాపులు, స్టేషనరీ మార్ట్‌లు, మొబైల్ రిపేర్ కేంద్రాలనే ‘బ్యాంకింగ్ పాయింట్లు’ గా మార్చుకుంటోంది.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో బజాజ్ ఆటో రూ.1,408.49 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నమోదు చేసిన రూ.1,175.47 కోట్లతో పోలిస్తే ఇది 19.82 శాతం ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.6,788.43 కోట్ల నుంచి రూ.7,395.19 కోట్లకు పెరిగింది.
*మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రూ.6,099.27 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.5,218.10 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 17 శాతం అధికం. నిల్వలు, విదేశీ మారకంపై లాభం ఆర్జించగా.. రిఫైనరీ మార్జిన్లు మాత్రం తగ్గాయి.
*డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికానికి మెరుగైన ఫలితాలు ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదేకాలంతో పోల్చినప్పుడు ఆదాయం 14 శాతం పెరిగిరూ.4,016 కోట్లకు, నికరలాభం 44% వృద్ధిచెంది రూ.434 కోట్లకు చేరాయి.
మార్కెట్లోకి టొయోటా గ్లాన్జా-వాణిజ్య-05/18
Related tags :