కేన్సర్ వ్యాధి బారిన పడి.. చికిత్సకు ఖరీదైన మందులను కొనలేని దుస్థితిలో ఉన్న బాధితులకు ఊరట.
కీమోథెరపీ ఇంజక్షన్లు సహా.. కేన్సర్ చికిత్సకు ఉపయోగించే తొమ్మిది రకాల మందుల ధరలను 90 శాతం వరకు తగ్గించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) నిర్ణయించింది.
మందుల ధరలు తగ్గిస్తున్నట్లుగా తెలుపుతూ ఈ నెల 15న కేంద్ర ప్రభుత్వానికి ఎన్‌పీపీఏ నివేదిక సమర్పించింది.
దీని ప్రకారం.. ఊపిరితిత్తుల కేన్సర్ చికిత్స కీమోథెరపీలో ఉపయోగించే పెమెట్రెక్స్‌డ్ (500 ఎంజీ) ఇంజక్షన్‌కు ఇప్పటిదాకా ఉన్న రూ.22 వేల ధర ఏకంగా రూ.2800కు తగ్గనుంది.
ఇదే ఇంజక్షన్ 100 ఎంజీ డోస్ ధర రూ.7700 ఉండగా.. ఇకపై అది రూ.800కే లభించనుంది.
ఇక రూ.సాధారణ కీమో డ్రగ్ అయిన ఎపిరూబిసిన్ 50 ఎంజీ ధర రూ.2662 నుంచి రూ.960కి తగ్గనుంది.
వీటితోపాటు ఎర్లోటినిబ్ (ఎర్లోటజ్), ఎవరోలిమస్ (లానోలిమస్) ట్యాబ్లెట్ల ధరలు, లీప్రొలైడ్ ఎసిటేట్ హార్మోనల్ థెరపీ ఇంజక్షన్ వంటి వాటి ధరలు కూడా గణనీయంగా తగ్గనున్నాయి.
కాగా ఈ ఏడాది మార్చి నుంచే కేన్సర్ మందుల ధరలను ఎన్‌పీపీఏ రెండోసారి తగ్గించడం గమనార్హం.