యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. మర్యాదపూర్వకంగానే సోనియాతో చంద్రబాబు భేటీ అయ్యారని తెదేపా వర్గాలు చెబుతున్నప్పటికీ.. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఎన్డీయే యేతర భాగస్వామ్యపక్షాలను ఏకతాటిపైకి తేవడం, ఎన్డీయే యేతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆ దిశగా చేపట్టాల్సిన ప్రయత్నాలపై చర్చించినట్టు సమాచారం. హస్తిన పర్యటనలో ఉన్న చంద్రబాబు ఇప్పటికే పలు రాజకీయ పార్టీల అగ్రనేతలతో చర్చలు జరిపిన నేపథ్యంలో భాజపాయేతర పార్టీలను కలుపుకొని ఎలా ముందుకెళ్లాలి?ఆయా పార్టీలు లేవనెత్తిన అంశాలను ఎలా నివృత్తి చేయాలనే అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలన్నీ ప్రాథమికంగానే ఉన్నాయి.. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి మాట్లాడుకున్న తర్వాత ఒకే వేదికపై చర్చించి ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన మార్గాలేంటనే విషయాలపై చర్చించినట్టు సమాచారం. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తికావడంతో 21 పార్టీల కూటమి నేతలంతా కాస్త తీరికగా ఉండే అవకాశం ఉన్నందున రేపు సాయంత్రం గానీ, ఎల్లుండి గానీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
సోనియాను మర్యాద కోసం కలిశాను అంతే!
Related tags :