Politics

గూగుల్ ఫేస్‌బుక్‌లపై ₹53కోట్లు కుమ్మరించిన భారతీయ పార్టీలు

Indian political parties spent 53 crore rupees on social media campaigns

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ నేటితో ముగిసింది. ఇక ఫలితాలే తరువాయి. మే 23 కోసం యావత్‌ భారతదేశం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటివరకూ ప్రజలకు చేరువయ్యేందుకు ఆయా రాజకీయ పార్టీలు తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకున్నాయి. ఈ సారి సమాజిక మాధ్యామాల్లోనూ విస్తృత ప్రచారం నిర్వహించాయి. ఫిబ్రవరి నుంచి మే వరకూ గూగుల్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం రాజకీయ పార్టీలు దాదాపు రూ.53 కోట్ల ఖర్చు పెట్టాయి. పార్టీలు పెట్టిన ప్రచార ఖర్చులను ఆయా సామాజిక మాధ్యమాలు వెల్లడించాయి. ఇక ప్రచార ఖర్చులో అధికార భాజపా తొలి స్థానంలో నిలిచింది.

‘ఫేస్‌బుక్‌ యాడ్‌ లైబ్రరీ’ నివేదిక ప్రకారం.. తమ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా 1.21 లక్షల యాడ్స్‌ వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే 15 వరకూ దాదాపు ఆయా పార్టీలు రూ.26.5 కోట్లు ఖర్చు చేశాయి. ఇక గూగుల్‌, యూట్యూబ్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల కోసం ఆయా పార్టీల నేతలు రూ.26.5 కోట్లు ఖర్చు చేశారు. ఫిబ్రవరి 19 నుంచి దాదాపు వీటిల్లో 14,837 ప్రకటనలు వచ్చాయి.

⇒ భాజపా ఫేస్‌బుక్‌లో రూ.4.23 కోట్లతో 2,500కుపైగా ప్రకటనలు ఇచ్చింది. ‘మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ మోదీ’, ‘భారత్‌ కే మన్‌కీబాత్‌’, ‘నేషన్‌ విత్‌ నమో’లాంటి పేజీల ద్వారా ప్రచారానికి మరో రూ.4 కోట్లు కేటాయించింది. ఇక గూగుల్‌ ఫ్లాట్‌పామ్‌పై ఆ పార్టీ రూ.17 కోట్లు ఖర్చు పెట్టింది.
⇒ కాంగ్రెస్‌.. ఫేస్‌బుక్‌లో రూ1.46 కోట్ల ఖర్చుతో 3,686 ప్రకటనలు ఇచ్చింది. గూగుల్‌ వేదికగా 425 ప్రకటనలతో మరో రూ.2.71 కోట్లు ఖర్చు చేసింది.
⇒ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫేస్‌బుక్‌ వేదికగా రూ.29.28 లక్షలు ఖర్చు చేసింది.
⇒ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ఫేస్‌బుక్‌ వేదికగా రూ.13.62 లక్షలు ఖర్చు చేసింది. ఇక గూగుల్‌ వేదికగా ఆ పార్టీ ప్రచార బాధ్యతలు చూసుకునే ఆబర్న్‌ డిజిటల్‌ సొల్యూషన్స్‌ ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకూ రూ.2.18 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.

సామాజిక మాధ్యమాల వేదికగా ఆయా రాజకీయా పార్టీలు చేసే ఖర్చుల వివరాలను పారదర్శకత కోసం వెల్లడిస్తామని గతంలోనే గూగుల్‌, ఫేస్‌బుక్‌లాంటి సంస్థలు వెల్లడించాయి.