పది రూపాయల నాణేలు చెల్లుతాయని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఎన్నిసార్లు చెబుతున్నా ప్రజలు మాత్రం పట్టించుకోవట్లేదు. రూ. 10 నాణెం చూపించగానే ‘మేం తీసుకోం.. నోటు ఇవ్వండి’ అని అంటున్నారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ పరిస్థితి నెలకొనగా.. మణిపూర్‌లో మాత్రం మరింత దారుణంగా ఉందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు రూ. 10 నాణేన్ని తీసుకునేందుకు ససేమిరా అంటున్నారట. రూ. 10 నాణేలు చలామణిలో ఉన్నప్పటికీ అవి చెల్లుతాయో లేదో అన్న అనుమానం ఇంకా చాలా మందిలో ఉంది. సూపర్ మార్కెట్లు, బస్సులు, చిన్న చిన్న దుకాణాలు, కూరగాయల వ్యాపారులు 10 రూపాయాల నాణేలను తీసుకోవట్లేదని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మంగ్లెంబి తెలిపారు. కొన్ని ప్రయివేటు బ్యాంకులు సైతం నాణేలను అంగీకరించట్లేదని చెప్పారు. అయితే చాలా మంది ఇతరుల మాటలు నమ్మే రూ. 10 నాణేలను తీసుకోవట్లేదు. ‘పది రూపాయల నాణేలు చెల్లుతాయో లేదో నాకు తెలియదు గానీ.. వాటిని తీసుకోవద్దని నా తోటి వ్యాపారులు చెప్పారు’ అని స్థానిక మార్కెట్లో కూరగాయలు అమ్మే పిషక్ చెబుతున్నారు. రూ. 10 నాణేలపై గతంలోనూ అనేక వదంతులు వచ్చాయి. దీంతో స్పందించిన ఆర్‌బీఐ ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయని పలుమార్లు స్పష్టం చేసింది. ‘దేశీయ మార్కెట్లో 14 డిజైన్లలో రూ. 10 నాణేలు చలమాణిలో ఉన్నాయి. అవి నకిలీ నాణేలు కాదు. ఎలాంటి అనుమానం లేకుండా వాటిని తీసుకోవచ్చు’ అని ఆర్‌బీఐ వెల్లడించింది.
ఏ ఇబ్బంది ఉండదు. దర్జాగా తీసుకోండి!
Related tags :