Business

మాంచి దూకుడు మీద రంకెలు వేస్తోన్న భారతీయ స్టాక్ మార్కెట్లు

Indian stock markets on the rise to profits-tnilive - telugu news international - telugu latest business news

దేశీయ స్టాక్‌ మార్కెట్లు పదేళ్ల తర్వాత అతిభారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 1,434 పాయింట్లు లాభపడి 39,365 వద్ద, నిఫ్టీ 422 పాయింట్లు లాభపడి 11,830 వద్ద ముగిశాయి. భాజపా కూటమి మరో సారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించడంతో మార్కెట్లు లాభపడ్డాయి. రూపాయి విలువ కూడా బలపడింది. నేటి ర్యాలీని బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ షేర్లు నడిపించాయి. బ్యాంక్‌ నిఫ్టీ దాదాపు 4శాతం లాభపడింది. ఇక ఆటో ఇండెక్స్‌ లాభాలు కూడా 4శాతంగా నమోదయ్యాయి. సెన్సెక్స్‌లోని ఎస్‌బీఐ 8శాతం, యస్‌బ్యాంక్‌ 6శాతం, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌,ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, మారుతీ, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు 4 నుంచి 5శాతం వరకు లాభపడ్డాయి. రూపాయి విలువ రెండు వారాల్లో అత్యధిక స్థాయికి చేరింది. 69.36 మార్కును తాకింది. శుక్రవారం రూ.70.23 వద్ద ముగిసింది. ఒక వేళ ఎన్‌డీఏ కనుక 300 మార్కును దాటితే ర్యాలీ మే 23 తర్వాత కూడా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. వ్యవస్థలో నగదు ప్రవాహ పరిస్థితి, కార్పొరేట్‌ లాభాలు, ప్రపంచ వ్యాప్త పరిస్థితులు వంటి అంశాలను దృష్టిలోపెట్టుకొని నేడు మార్కెట్‌ జోరు కొనసాగింది. స్థిరమైన ప్రభుత్వం వస్తే ఆటో, ఇన్ఫ్రా, క్యాపిటల్‌ గూడ్స్‌, బ్యాంకింగ్‌ రంగాలు మెరుగైన పనితీరుకనబరుస్తాయని మార్కెట్‌ వర్గాలు భావించాయి. అందుకే ఆయా రంగాల షేర్లు నేడు పరుగులు తీశాయి.