WorldWonders

ఓరి మీ బండబడ…పేడతో కారు అలకడం ఏంది?

toyota covered in cow dung.

పేడతో పిడకలు చేసి గోడకు కొట్టడం, ఇళ్లలో నేల అలకడం వంటివి మన దేశంలో సర్వ సాధారణంగా కనిపించే దృశ్యాలు. ఎండాకాలం ఇంట్లోకి వేడి రాకుండా కొన్ని చోట్ల మట్టి గోడలను ఆవు పేడతో అలుకుతుంటారు. ఇలా చేస్తే చలి కాలంలో గది వెచ్చగా కూడా ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఇదే సూత్రాన్ని మరోలా ఓ మహిళ అమలు చేయగా.. ఈ పని ఇప్పుడు అంతర్జాలంలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. కొందరు ఈ వ్యక్తి తెలివిగలవాడని అంటుంటే, మరికొంత మంది వెక్కిరిస్తున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ తన ఖరీదైన కారు మొత్తానికి ఆవు పేడ పూసింది. అద్దాలు, లైట్లు, కంపెనీ లోగో మినహా కారు మొత్తం మందంగా ఆవు పేడ అద్దారు. దీనికి సంబంధించిన ఫోటోలను మరో వ్యక్తి ఫేస్‌బుక్‌లో పంచుకోవడంతో వెలుగులోకొచ్చింది. నగరంలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరిన నేపథ్యంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆమె ఈ పని చేసినట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన రూపేశ్‌ గౌరంగదాస్‌ వివరించారు. ‘‘ఆవు పేడను సరైన పద్ధతిలో ఉపయోగించారు. నేనెప్పుడూ ఇలా చూడలేదు. 45 డిగ్రీల ఎండను తట్టుకొనేందుకు ఆమె ఇలా చేశారు.’’ అని పోస్టుకు జత చేశారు. ఈ కారు యజమాని సేజల్‌ షాహ్‌ తనకు తెలుసని వివరించారు. పోస్టును చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.