Sports

స్వలింగ సంపర్కురాలినని ప్రకటన

Indias Star Athlete Dyuti Chand Comes Out Lesbian-TNILIVE sports

భారత స్టార్ అథ్లెట్ ద్యుతీచంద్ ఓ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. క్రీడా ప్రపంచంలో స్వలింగ సంబంధాలు కొత్త కాకున్న మనదేశంలో ఇది పెద్ద సంచలనమనే చెప్పాలి. గత ఐదేళ్లుగా మా సమీప బంధువైన 19 ఏండ్ల యువతితో డేటింగ్‌లో ఉన్నా. ఆమె ప్రస్తుతం భువనేశ్వర్‌లో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నది. నేను శిక్షణ నుంచి విరామం తీసుకొని ఎప్పుడు ఇంటికి వెళ్లినా ఆమెతోనే ఉంటా.. తను నాకు అత్యంత సన్నిహితురాలు. భవిష్యత్తులో ఆమెతోనే జీవితం కొనసాగించాలనుకుంటున్నాఅని ద్యుతీ ఆదివారం కుండబద్దలు కొట్టింది. గతేడాది ఆసియా క్రీడల్లో రెండు రజత పతకాలు నెగ్గిన 23 ఏండ్ల ద్యుతీ హైదరాబాద్‌లో ఉంటూ శిక్షణ తీసుకుంటున్నది. ప్రస్తుతం మహిళల 100 మీటర్ల జాతీయ రికార్డు ద్యుతీ (11.24 సెకండ్లు) పేరిటే ఉండటం విశేషం. మేజర్లు స్వలింగ వ్యక్తులతో సహజీవనం చేయడం నేరం కాదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో తన సహచరితో చర్చించాకే ఈ విషయాన్ని బయటపెట్టినట్లు ద్యుతీ పేర్కొంది. ఈ విషయంలో తన తల్లిదండ్రులతో ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. సోదరి మాత్రం ఆ అమ్మాయితో ఉండేందుకు నిరాకరిస్తుందని చెప్పుకొచ్చింది. అమ్మానాన్నా అభ్యంతరం చెప్పకున్నా.. సోదరి ఇబ్బంది పెడుతున్నది. ఆ అమ్మాయితో కలిసి ఉంటే ఇంట్లో నుంచి బయటకు గెంటేయడంతో పాటు జైలుకు పంపిస్తానని బెదిరిస్తున్నది. కానీ నేను ఆమెతోనే ఉండాలనుకుంటున్నా. భవిష్యత్తులో ఓకవేళ ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా నాకేం ఇబ్బంది లేదుఅని ద్యుతీ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా.. పురుష హార్మోన్లు అధికంగా ఉన్నాయనే కారణంగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్ నుంచి ద్యుతీ నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 2014లో చేసిన పరీక్షల్లో ఆమెలో మోతాదుకు మించిన పరిమాణంలో పురుష హార్మోన్లు ఉన్నట్లు తేలడంతో ఏడాది బ్యాన్ విధించింది. ఈ అంశంపై ఆర్బిట్రేషన్ కోర్టులో అప్పీలు చేసిన ద్యుతీ కేసు గెలిచి తిరిగి ట్రాక్‌పై అడుగుపెట్టింది.