ScienceAndTech

భవిత ఏమిటి?

What is Huaweis Future amidst google ban

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ హువావేపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన నిషేధం తీవ్ర ప్రభావం చూపనుందా? సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సహా ఇతర సేవలను ఇవ్వబోమని గూగుల్‌ ప్రకటన నేపథ్యంలో హువావే స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలపై ప్రభావం ఎలా ఉంటుంది? అసలు గూగుల్‌ సేవలు లేని హువావే ఫోన్లు పేపర్‌ వెయిట్‌లతో సమానమా? అంటే పలు నివేదికలు అవుననే అంటున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ తయారీదారుగా హువావే టాప్‌ లిస్ట్‌లో ఉంది. ఈ నేపథ్యంలో హువావే ఆండ్రాయిడ్‌ ఫ్లాట్‌ఫాం లేకుండా మొబైల్‌ ఫోన్లు తయారు చేస్తే, వినియోగదారులు ఆసక్తి చూపకపోవచ్చని హాంగ్‌కాంగ్‌కు చెందిన సౌత్‌ మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది. ఇదే అదనుగా శాంసంగ్‌ మరో అడుగు ముందుకు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంది. హువేవాకు శాంసంగ్‌ సహా, షామీ, ఒప్పోల నుంచి గట్టి పోటీ ఉంది. హువావేపై గూగుల్‌ నిషేధం విధించడం ఆయా కంపెనీలకు లాభించనుంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ విపణిలో తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో హువావేకు గూగుల్‌ సేవలు నిలిపివేయడం ఆ సంస్థకు శరాఘాతమే. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రతి మొబైల్‌ కంపెనీలు వినూత్న ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఫుల్‌స్క్రీన్‌ డిస్‌ప్లేలు, పాప్‌అప్‌ కెమెరాలు, ఫ్లిప్‌ కెమెరాలతో సహా అత్యంత వేగంగా పనిచేసే చిప్‌సెట్‌లతో కొత్త కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అయితే, ఎన్ని ఫీచర్లు జోడించినా, అవన్నీ గూగుల్‌ అందించే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌పైనే పని చేస్తాయి. పూర్తి ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ లేకుండా(యాపిల్‌ కాదు) తీసుకొచ్చిన ఫోన్లు అంతగా విజయం సాధించలేదన్నది జగమెరిగిన సత్యం.